- మిస్ ఇండియా కిరీటం రాజస్థానీ అమ్మాయికి
- కిరీటం గెలుచుకున్న నందినీ గుప్తా
- ఫస్ట్ రన్నరప్‌గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా
న్యూఢిల్లీ : ‘మిస్ ఇండియా 2023’ కిరీటం రాజస్థాన్‌లోని కోట నగరానికి చెందిన 19 ఏళ్ల నందినీ గుప్తాను వరించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో శనివారం జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫైనల్ఈవెంట్ఇందుకు వేదికగా నిలిచింది. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి.. మిస్ ఇండియా కిరీటాన్ని నందినీ గుప్తాకు అలంకరించారు. దీంతో త్వరలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నందిని దక్కించుకున్నారు. ఈ మెగా బ్యూటీ కాంటెస్ట్‌లో ఢిల్లీకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ శ్రేయా పూంజా ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, రెండో రన్నరప్‌గా మణిపూర్‌కు చెందిన టీవీ యాంకర్ తౌనావ్జంస్ట్రెలా లువాంగ్ నిలిచారు.
స్ఫూర్తి ప్రదాత.. రతన్ టాటా
మిస్ ఇండియా నందినీ గుప్తా విషయానికి వస్తే ఆమె బిజినెస్ మేనేజ్ మెంట్లో డిగ్రీ చేశారు. వ్యాపార దిగ్గజం రతన్‌టాటా తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆమె చెప్పారు. నటనలో తనకు ఎంతో ఇష్టమైన యాక్టర్ ప్రియాంకా చోప్రా అని తెలిపారు. రాజస్థాన్‌లోని తన స్వస్థలం కోటకు ప్రత్యేకమైన డోరియా చీరలను ప్రమోట్ చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని నందినీ గుప్తా వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 30 మంది ఫైనల్స్‌లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జడ్జీలుగా 2002 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ నేహా ధూపియా, స్టార్ కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయీస్, ఫిల్మ్ డైరెక్టర్ హర్షవర్ధన్ కులకర్ణి, ప్రముఖ డిజైనర్లు రాకీ స్టార్, నమ్రత జోషిపుర, సరితాదేవి వ్యవహరించారు. అందం, అభినయంతో జడ్జిల నుంచి మార్కులు పొందేందుకు పోటీదారులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ యాక్టర్లు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే డ్యాన్స్ ప్రదర్శనతో అలరించారు. ఈ ఫైనల్ కాంటెస్ట్ మే 14న ఉదయం 10 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. కాగా, తెలంగాణకు చెందిన ఊర్మిలా చౌహాన్, ఏపీకి చెందిన గోమతి రెడ్డి కూడా పోటీపడ్డారు.
