ముంబై దాడుల నిందితుడు టైగర్ మేమన్ ఆస్తుల వేలం.. విలువ రూ.400 కోట్లపైనే..!

ముంబై దాడుల నిందితుడు టైగర్ మేమన్ ఆస్తుల వేలం.. విలువ రూ.400 కోట్లపైనే..!

ముంబైని కుదిపేసిన 1993 సీరియల్ బాంబు పేలుళ్లకు మూడు దశాబ్దాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఆ దాడికి ప్రధాన నిందితులుగా ఉన్న టైగర్ మేమన్ కుటుంబానికి చెందిన ఆస్తులను వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ అథారిటీ(SAFEMA) దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ ప్రక్రియలో ముంబైలోని మహీమ్‌లో ఉన్న అల్ హుస్సైని భవనంలోని మూడు ఫ్లాట్లు ముఖ్యంగా ఉన్నాయి. ఈ భవనంలోనే పేలుళ్లకు ముందు కీలక కుట్ర సమావేశం జరిగినట్టు విచారణాధికారులు గుర్తించారు. 

టాడా ప్రత్యేక న్యాయస్థానం గుర్తించిన 17 ఆస్తులలో ఎనిమిది ఆస్తులను SAFEMA ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. వాటి వివరాలను పరిశీలిస్తే..

1. మహీమ్‌లోని అల్ హుస్సైని భవనంలోని మూడు ఫ్లాట్లు (టైగర్ మేమన్, అతని సోదరులు, తల్లి నివసించినవి)
2. బాంద్రాలో ఒక ఫ్లాట్
3. కుర్లాలోని కపాడియా నగర్‌లో రెండు ఫ్లాట్లు
4. సౌత్ ముంబైలోని మానిష్ మార్కెట్‌లో ఉన్న నాలుగు షాపులు (టైగర్ మేమన్, సహనిందితుడు మహ్మద్ దోసాలకు చెందినవి)

ఈ ఆస్తులు 1993లోనే సీజ్ చేయబడినప్పటికీ.. దశాబ్దాలుగా సీల్డ్‌గానే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారి వాటిని తెరిచి వాల్యుయేషన్ చేపట్టారు. చట్టపరమైన ప్రక్రియ వేగంగా పూర్తైతే డిసెంబర్ లేదా జనవరిలో వేలం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే మేమన్ కుటుంబానికి చెందిన అత్యంత విలువైన ఆస్తి వకోలా ప్రాంతంలోని కోలే కాల్యాన్‌లో ఉన్న 10,000 చదరపు మీటర్ల భూమి. దీని విలువ సుమారు రూ.400 కోట్లుగా అంచనా. కానీ ఆ భూమిపై ఆక్రమణల సమస్య ఉండడంతో పాటు చుట్టూ రెండు భవనాలు ఉండటంతో భౌతిక స్వాధీనత క్లిష్టంగా మారింది. 

ఇంతకీ అన్ని ఆస్తులు వేలానికి సిద్ధం కాలేదు. నాలుగు ఆస్తులు ఇంకా కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఐదు ఆస్తులపై హక్కులు SAFEMAకి బదిలీ ప్రక్రియలో ఉన్నాయి. మానిష్ మార్కెట్ షాపులపై టాడా కోర్టు ఇచ్చిన హ్యాండోవర్ ఆర్డర్‌కి వ్యతిరేకంగా అప్పీల్ వేయబడింది. వీటి పరిష్కారం తర్వాతే పూర్తి లిస్టు వేలానికి వస్తుంది. ఇప్పటికే ఆస్తుల వేలం చాలా ఆలస్యం అయ్యిందని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు. డిసెంబర్ లేదా జనవరిలో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

టైగర్ మేమన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్నట్లు భారత అధికారులు అంటున్నారు. అతని సోదరుడు యాకూబ్ మేమన్ 2015లో ఉరిశిక్ష అనుభవించాడు. 1993 మార్చి 12న జరిగిన ముంబై పేలుళ్లలో 257 మంది మృతి చెందగా, వందల మంది గాయపడ్డారు.