కేరళ స్పోర్ట్స్ హాస్టల్‌లో విషాదం: ఒకే గదిలో ఉరివేసుకున్న ఇద్దరు మైనర్ క్రీడాకారిణులు..

కేరళ  స్పోర్ట్స్ హాస్టల్‌లో విషాదం: ఒకే గదిలో ఉరివేసుకున్న ఇద్దరు మైనర్ క్రీడాకారిణులు..

కేరళలోని కొల్లం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్‌లో శిక్షణ పొందుతున్న ఇద్దరు విద్యార్థినిలు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

ఎం జరిగిందంటే: 
 మరణించిన వారిలో ఒకరికి 17 ఏళ్లు, మరొకరికి 15 ఏళ్లు. వీరిద్దరూ కోజికోడ్, తిరువనంతపురం ప్రాంతాలకు చెందిన వారు. రోజూలాగే ఉదయం 5 గంటలకు జరగాల్సిన ట్రైనింగ్ సెషన్‌కు వీరిద్దరూ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు గది దగ్గరకు వెళ్లి తలుపు కొట్టారు. ఎంతసేపటికీ సమాధానం లేకపోవడంతో హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా, ఇద్దరు బాలికలు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు.

పోలీసుల వివరాల ప్రకారం 17 ఏళ్ల అమ్మాయి 12వ తరగతి చదువుతూ అథ్లెటిక్స్ లో శిక్షణ పొందుతోంది. 15 ఏళ్ల అమ్మాయి 10వ తరగతి చదువుతున్న కబడ్డీ క్రీడాకారిణి.

ఘటన జరిగిన రాత్రి 15 ఏళ్ల అమ్మాయి నిజానికి వేరే గదిలో ఉండాలి, కానీ బుధవారం రాత్రి తన స్నేహితురాలైన మరో అమ్మాయి గదికి వెళ్లి అక్కడే ఉంది. పోలీసులు బాలికల రూం చెక్ చేయగా ఎలాంటి  సూసైడ్ నోట్ దొరకలేదు.

ఉదయం శిక్షణకు వెళ్లాల్సిన బాలికలు ఇలా ఉరివేసుకొని కనిపించడంతో హాస్టల్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.