హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఇందుకోసం యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీకి బాధ్యడైన ఐటీ మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్లతో ఈనెల 11న సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ‘నిరుద్యోగ మార్చ్’కు యువత, ప్రజాస్వామికవాదులంతా తరలిరావాలని కోరారు. ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ల తర్వాత వచ్చే నెలలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఉద్యోగాల భర్తీ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిన తీరును ‘నిరుద్యోగ మార్చ్’ ద్వారా ప్రజల్లో ఎండగడతామన్నారు. అల్లూరి వర్ధంతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్ర పటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, చింతల రాంచంద్రారెడ్డి, గౌతం రావు ఉన్నారు.