లక్కీ సీటు 11ఏ: ఈ సీటుతో విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఇద్దరు

లక్కీ సీటు 11ఏ: ఈ సీటుతో విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఇద్దరు
  • ఎయిరిండియా ఇన్సిడెంట్‌‌లో బతికిన రమేశ్ 
  • అచ్చం ఆయన లెక్కనే 27 ఏండ్ల కింద జేమ్స్‌‌ సజీవం 

న్యూఢిల్లీ: కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. అదే అద్భుతం మళ్లీ జరిగితే ఆశ్చర్యానికి గురవుతాం. ఇదీ అలాంటిదే.. ఎయిరిండియా విమాన ప్రమాదంలో రమేశ్​ ఒక్కడే బతికి బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే, అచ్చం ఆయన లెక్కనే 27 ఏండ్ల కింద ఓ వ్యక్తి బతికి బయటపడ్డాడు. వీళ్లద్దరూ కూర్చున్నది ఒకే నెంబర్ సీటు. ఇద్దరూ చిన్న చిన్న గాయాలతో ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఆనాడు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన నటుడు, సింగర్ జేమ్స్‌‌‌‌‌‌‌‌ రువాంగ్‌‌‌‌‌‌‌‌సాక్. 

ఏఐ విమాన ప్రమాదం గురించి మీడియా ద్వారా తెలుసుకున్న అతను.. సోషల్ మీడియాలో స్పందించాడు. ఆరోజు తాను కూడా అదే నెంబర్ సీటులో కూర్చున్నానని గుర్తు చేసుకున్నాడు. జేమ్స్‌‌‌‌‌‌‌‌ 1998లో థాయ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్‌‌‌‌‌‌‌‌లో బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌ నుంచి సూరత్ థానీ సిటీకి ప్రయాణం చేశాడు. అయితే సూరత్ థానీలో ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్ అవుతున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో క్రాష్ అయింది. 

అందులో ఉన్న 146 మందిలో 101 మంది చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన 45 మందిలో జేమ్స్ ఒకడు. అతడు కూర్చున్న సీటు 11ఏ. ఎయిరిండియా ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో విశ్వాస్ కుమార్ రమేశ్ కూర్చున్న సీటు నెంబర్ కూడా 11ఏ. ఇది ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉండడంతో వీళ్లిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.