
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఇన్చార్జ్ డీజీపీగా ఉన్న రవి గుప్తాను పూర్తి స్థాయి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మొత్తం 20 మంది ఐపీఎస్అధికారుల ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్‌పై మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి వరకు డీజీపీగా ఉండి.. ఈసీ ఆదేశాలతో సస్పెన్షన్‌కు గురై, ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేతతో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అంజనీ కుమార్‌ను రోడ్డు భద్రతా విభాగం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో లూప్లైన్లో ఉన్న కీలక ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రస్తుత ప్రభుత్వం ఫోకల్ పోస్టింగ్‌లు కేటాయించింది. ఆర్బీవీఆర్ఆర్ అకాడమీ అదనపు డీజీగా ఉన్న ఏ.ఆర్.శ్రీనివాస్ ను ఏసీబీ డైరెక్టర్‌గా నియమించింది. ఈయన ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ డైరెక్టర్ పోస్టు నుంచే అకాడమీకి బదిలీ అయ్యారు.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తిరిగి ఏసీబీలోకి తీసుకున్నది. ఇదిలా ఉంటే.. స్టీపెన్ రవీంద్రను హోంగార్డ్స్ ఐజీగా, మహేష్ భగవత్ కు రైల్వేస్, రోడ్డు సేఫ్టీ అదనపు డీజీగా ప్రభుత్వం నియమించింది. సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. శిఖా గోయల్ కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.