20 లక్షల కోట్ల ప్యాకేజీని అందించాలి

20 లక్షల కోట్ల ప్యాకేజీని అందించాలి
  • ఆత్మనిర్భర్ కింద ప్రకటించిన ప్యాకేజీని వ్యాపారులకు అందించే వరకు కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉంటాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: కేంద్రం గతంలో ప్రకటించిన విధంగా ఎంఎస్ఎంఈ(MSME)లకు 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజి వ్యాపారులకు అందించాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం అందించే వరకు ఈ విషయం గుర్తు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ ఎక్స్ పో కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. 2021 సంవత్సరానికి గాను బెస్ట్ ఇన్నోవేషన్ –గోల్డ్ కేటగిరీలో భారత్ బయోటెక్ కు అవార్డును అందజేశారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా అవార్డులను అంద చేశారు. 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళుతోందన్నారు. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం దేశ జీడీపీలో 5 శాతం తెలంగాణ అందిస్తోందని, నాలుగవ అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్ గా తెలంగాణ అవతరించిందని వివరించారు. మరింత అభివృద్ధి సాధించేందుకు సీఐఐ హైదరాబాద్, సీఐఐ తెలంగాణతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లు అవుతున్నా విభజన హామీలు అమలు చేయకుండా తెలుగు రాష్ట్రాల పట్ల పక్షపాతం ప్రదర్శిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం ఐటీఐఆర్ ప్రాజెక్టుపై పట్టుపట్టినా కేంద్రం పటించుకోవట్లేదన్నారు. యూపీ, బీహార్, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కేంద్రం నుండి మొండి చేయి ఎదురవుతోందని, బులెట్ ట్రైన్ లు అయినా, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల్లో అయినా ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కనపడట్లేదన్నారు.