చేవెళ్ల, వెలుగు: సొంత కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఎల్బీనగర్లోని ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామానికి చెందిన దాదే రాజు (37) తన సొంత కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీనిపై 2024 అక్టోబర్ 12న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది.
కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇన్స్పెక్టర్ బి. కాంతారెడ్డి ఆధ్వర్యంలో వేగంగా దర్యాప్తు చేపట్టి, పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు.. 20 ఏండ్ల జైలుశిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించింది, అలాగే బాధిత బాలికకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసులో సమర్థంగా వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిక్షపతి గౌడ్, కోర్టు సిబ్బందిని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేకంగా అభినందించారు.
