పొంగులేటి ఆక్రమణలో.. 21.5 గుంటల ఎన్​ఎస్పీ ల్యాండ్

పొంగులేటి ఆక్రమణలో.. 21.5 గుంటల ఎన్​ఎస్పీ ల్యాండ్

ఖమ్మం టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ​నుంచి కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆక్రమణలో 21.5 గుంటల ఎన్ఎస్పీ (నాగార్జున సాగర్​ ప్రాజెక్టు) భూమి ఉందని అధికారులు తేల్చారు. సోమవారం ల్యాండ్​ సర్వే, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది కలిసి జాయింట్ సర్వే నిర్వహించారు. ఎన్ఎస్పీ ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ఎస్ఆర్​ గార్డెన్స్ ​పరిధిలో ఈ భూమి ఉందంటూ ఆఫీసర్లు మార్కింగ్ చేశారు. ఆక్రమిత ప్రాంతాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా, కాంగ్రెస్​ కార్యకర్తలు, పొంగులేటి అనుచరులు అడ్డుకున్నారు. వ్యవహారం కోర్టులో ఉండగా సెలవు రోజు సర్వే చేసి, టైం కూడా ఇవ్వకుండా కూల్చేందుకు ప్రయత్నించడం అధికార పార్టీ కుట్రలో భాగమని ఆరోపించారు. 

కోర్టు ఆదేశాలతో...

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూలోని సర్వే నెంబర్140లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన ఎస్ఆర్ గార్డెన్ ఉంది. ఇందులో ఇరిగేషన్ ల్యాండ్ 21.5 గుంటల భూమి ఆక్రమణకు గురైందని ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో సర్వే చేసి తేల్చారు. తహసీల్దార్  శైలజ కథనం ప్రకారం..2022 డిసెంబర్​లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి 140 సర్వే నెంబర్ లో భూమి తమదని ఎన్​వోసీ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఎన్​వోసీ ఇవ్వడం ఆలస్యం కావడంతో కోర్టు నోటీసులు పంపించారు. రెండు నెలల్లో సమగ్ర సర్వే చేసి హద్దులు తేల్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వే చేస్తున్నామని, రావా లని దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు రెండు సార్లు నోటీసులు పంపించారు. అయినా హాజ రు కాలేదు. కోర్టు గడువు ఈనెల15తో పూర్త వుతుండడంతో మళ్లీ సమాచారమిచ్చినా రాలేదు. దీంతో సోమవారం ఇరిగేషన్​, రెవెన్యూ,  ల్యాండ్​సర్వే డిపార్ట్​మెంట్లు జాయింట్​సర్వే చేసి 21.5 గుంటలు ఆక్రమణకు గురైందని తేల్చారు. 

ALSO READ :పీఎం సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతించండి

 పొంగులేటి అనుచరుల రాకతో ఉద్రిక్తత

ఆక్రమణకు గురైన ఎన్​ఎస్పీ భూమిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పొంగులేటి అనుచరులు గార్డెన్​ దగ్గరకు భారీగా చేరుకున్నారు. పొంగులేటి లాయర్లు స్టేటస్ ​కో కోసం హైకోర్టులో పిటిషన్ వేశారని, సెలవు రోజు కూల్చేందుకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. అధికార పార్టీ కక్షపూరిత చర్యలో భాగమేనని ఆరోపించారు. ఎన్ఎస్పీకి చెందిన భూముల్లో మొదటి నుంచి ఇప్పటివరకు ఉన్న ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాతే ఇక్కడ కూల్చివేయాలని డిమాండ్​ చేశారు. తర్వాత అధికారులు మార్కింగ్ చేసి వెళ్లిపోవడంతో ఆందోళనకారులు వెనక్కితగ్గారు. ఇరిగేషన్ డీఈ గోపాల్, ఏఈ సతీష్, అర్బన్ సిఐ శ్రీహరి, రెవెన్యూ ఆర్ఐ రమేశ్​పాల్గొన్నారు.