
ఛత్తీస్ ఘడ్ తెలంగాణ బార్డర్ కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రె గుట్టెలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ఐ జీ సుందర్ రాజ్ పి, సీఆర్ పీఎఫ్ ఐ జీ .రాకేష్ అగర్ వాల్ ఈ ఎన్ కౌంటర్ ను ధృవీకరించారు. కర్రెగుట్టలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు మడవి హిడ్మా, దేవా దళాలతో పాటు దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు కర్రె గుట్టల్లో ఆశ్రయం పొందారనే పక్కా సమాచారంతో చత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్, డీఆర్‌జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా తదితర భద్రతా బలగాలు ఏప్రిల్ 21నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మానే లక్ష్యంగా స్పెషల్ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రె గుట్టల్లో కాల్పుల మోత మోగిస్తున్నాయి. గుట్టలను చుట్టుముట్టి 15 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 27న జరిగిన ఎన్ కౌంటర్లో కూడా 30 మందికి పైగా మావోలు మృతి చెందినట్లు సమాచారం.
కర్రెగుట్టలో స్పెషల్ ఆపరేషన్ ఆపాలంటూ పౌర హక్కుల సంఘాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం ఈ నరమేధం ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాల్పులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా కూడా.. ఏకపక్షకాల్పులు జరపడం సరి కాదని అంటున్నారు. కాల్పులు విరమించి శాంతిచర్చలు జలపాలని డిమాండ్ చేశారు.