- ఈ నెల 4న టెక్నికల్ అవెల్యూషన్ మీటింగ్
- ఎన్హెచ్ఏఐ, ఇతర రాష్ట్రాల్లో హ్యామ్ టెండర్ల తీరుపై చర్చ
- ఆ తర్వాతే టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ( ఆర్ అండ్ బీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్ల టెండర్లకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లను ఆఫీసర్లు తెరిచారు. టెండర్లు వేసిన కంపెనీలు ఒక్కో ప్యాకేజీలో 15 నుంచి 23 శాతం ఎక్సెస్ వేసినట్టుగా గుర్తించారు. ఈ టెండర్ల విషయమై ఈ నెల 4న(సోమవారం) టెక్నికల్ అవెల్యూషన్ మీటింగ్ జరగనున్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్హెచ్ఏఐ, ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన హ్యామ్ టెండర్లపై చర్చించనున్నారు.
అక్కడ ఎక్సెస్‌లో టెండర్లు ఖరారు చేశారా? లేదా? అనే విషయాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరగనున్నది. ఇందుకుగాను రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లు ఫైల్ సిద్దం చేశారు. ఈ మీటింగ్‌లో పాల్గొనే ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
441 రోడ్లు.. రూ. 13 వేల కోట్ల నిధులు
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ తరఫున 32 జిల్లాల పరిధిలో రూ.13,006 కోట్లతో 441 రోడ్లను బాగుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 6,092.37 కి.మీ రోడ్ల నిర్మాణానికి గతేడాది జూన్ నెలలో జీవో జారీ చేశారు. రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు గల పనులను ఒక్కో ప్యాకేజీగా వర్గీకరిస్తూ మొత్తం 34 ప్యాకేజీలుగా పనులను విభజించి గతేడాది అక్టోబర్ 23న టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు తమకు ఆర్బీఐ గ్యారంటీ కావాలని కోరడంతో ప్రభుత్వం ఆర్బీఐ బ్యాంకర్లతో మీటింగ్‌లు పెట్టి కాంట్రాక్ట్ సంస్థలను టెండర్లు వేసేలా చర్యలు తీసుకున్నది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హ్యామ్ ప్రాజెక్ట్ ఇంజినీర్లు టెక్నికల్ బిడ్లను తెరవగా 34 ప్యాకేజీలకు సంబంధించి పనులు దక్కించుకోవడానికి 90కి పైగా కంపెనీలు టెండర్లు వేశాయి. ఒక్కో కంపెనీ మూడు, నాలుగుకుపైగా టెండర్లు దాఖలు చేసినట్టు సర్కారు ఇంజినీర్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), 11 రాష్ట్రాలలో హ్యామ్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అనుభవం ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కంపెనీలు ఈ వర్క్‌లు దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి.
15 నుంచి 23 శాతం ఎక్సెస్ వేసిన కంపెనీలు
ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లు శుక్రవారం హ్యామ్ రోడ్ల టెండర్లకు సంబంధించిన టెక్నికల్ బిడ్లను తెరిచారు. ఒక్కో ప్యాకేజీ వర్క్‌కు గానూ ప్రభుత్వం పిలిచిన టెండర్లపై 15 నుంచి 23 శాతం ఎక్సెస్ వేసినట్టుగా గుర్తించారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎన్హెచ్ఏఐతో పాటు 11 రాష్ట్రాలలో విజయవంతంగా చేపట్టిన హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్)ను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. హ్యామ్ ప్రాజెక్ట్‌లో పనులు చేపడితే ఒప్పందం ప్రకారం 30 నెలల్లో పనులు కంప్లీట్ చేసిన సమయంలో వర్క్ చేసిన సంస్థకు 40 శాతం బిల్లులను మాత్రమే చెల్లిస్తారు. బ్యాలెన్స్ 60 శాతం నిధుల చెల్లింపుకు 15 ఏండ్ల గడువు పెట్టారు. అది కూడా విడుతల వారీగా చెల్లించనున్నారు. దీంతో చేసిన పనుల బిల్లుల కోసం 15 ఏండ్లు పాటు వేచి చూడాల్సి వస్తుండటంతో కంపెనీలన్నీ కూడా ఎక్సెస్ వేసినట్టుగా ఆఫీసర్లు భావిస్తున్నారు.
ఈ నెల 4న టెక్నికల్ అవెల్యూషన్ మీటింగ్
హ్యామ్ రోడ్ల టెండర్ల ఖరారు చేయడానికి ఈ నెల 4న టెక్నికల్ అవెల్యూషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్ అండ్ బీ శాఖ ఈఎన్సీతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఈఎన్సీ, ట్రైబల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సీఈ, ఫైనాన్స్సెక్రటరీలో పాల్గొననున్నారు. ఈ మీటింగ్‌లో చర్చించడానికి ఆర్ అండ్ బీ శాఖ ఫైల్ సిద్దం చేసింది. బిహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాల్లో హ్యామ్ విధానంలో ఖరారు చేసిన టెండర్ల వివరాల ఆధారంగా ఫైల్ రెడీ చేశారు. మీటింగ్ తర్వాత ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ టెండర్లను ఖరారు చేస్తుందని ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లు ‘వీ6 వెలుగు’తో చెప్పారు.
