23 ఏండ్లకే మూడు లక్షల మొక్కలు నాటిండు

23 ఏండ్లకే మూడు లక్షల మొక్కలు నాటిండు

ఓ సాదాసీదా ఇంజినీరింగ్​ స్టూడెంట్..పెద్ద కల కన్నాడు. అయితే ఆ కల లక్షలు తెచ్చిపెట్టే ఉద్యోగం కోసం కాదు. కోట్లు కురిపించే వ్యాపారాల గురించి అంతకన్నా కాదు. తను కన్న ఆ కలలో నలుగురూ సంతోషంగా ఉండాలన్న ఆశ మాత్రమే అతనిది. ఆ ఆశయంతోనే తన కలని నిజం చేసుకోవడానికి బయల్దేరాడు.. మూడు లక్షల మొక్కలతో ఏకంగా ఒక అడవినే సృష్టించాడు. 23 ఏండ్లకే ఇన్ని లక్షల మొక్కలు నాటిన ఇతని  పేరు విశాల్ శ్రీవాత్సవ. 

విశాల్ శ్రీవాత్సవ మధ్యప్రదేశ్​లో పుట్టాడు. పేద కుటుంబం, తండ్రి లేడు. దాంతో చిన్నప్పట్నించీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు​. తాగడానికి బుక్కెడు నీళ్లు కూడా ఉండేవి కాదు. వాటికోసం వాటర్​ ట్యాంక్​ వెనుక మైళ్ల తరబడి పరిగెత్తిన రోజులెన్నో. తను ఉంటున్న వీధిలో కటిక చీకటి. వెలుతురు అనేదే ఉండేది కాదు.  తన చుట్టూ ఉన్నవాళ్లవి కూడా ఇంచుమించు ఇవే అవస్తలు. దాంతో ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి అనుకున్నాడు. నీటి కొరత, ఇతర ఎన్విరాన్మెంటల్​ ఇష్యూల గురించి రీసెర్చ్​ చేశాడు. ‘ప్రయాస్’​ అనే ఎన్జీవోతో కలిసి పని చేయడం మొదలుపెట్టాడు.

మియావాకి టెక్నిక్​తో.. 

ఇంజినీరింగ్​ సెకండ్​ ఇయర్​ చదివేటప్పుడు ఎన్జీవో​తో కలిసి గ్వాలియర్‌‌ ప్రాంతానికెళ్లాడు విశాల్. అక్కడివాళ్లు మంచినీళ్ల  కోసం పడుతున్న కష్టాల్ని చూశాక.. తన చిన్నతనం కళ్లముందుకొచ్చింది. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలనుకున్నాడు. అలాగే వాటర్​ ట్యాంక్స్​ ఏర్పాటు చేయడానికి నిధులు సేకరించాడు. మూడేండ్లలో మూడు లక్షల చెట్లు నాటాడు. మరో లక్ష చెట్లు త్వరలో నాటబోతున్నాడు. 

మియావాకి టెక్నిక్​ ద్వారా మొక్కలు పెంచుతున్నాడు విశాల్​. ఈ పద్ధతిలో  తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటొచ్చు.  అదెలాగంటే..చిన్న, పెద్ద, మధ్యరకం.. ఇలా వివిధ సైజ్​లున్న మొక్కల్ని పక్కపక్కన నాటతారు. ఒక మొక్క ఎదుగుదల ప్రభావం ఇంకో మొక్కపై  పడకుండా ఎత్తు విషయంలో స్పెషల్​ కేర్​ తీసుకుంటారు. డ్రిప్​​ పద్ధతిలో నీళ్లు పెడతారు. ఈ జపనీస్​ టెక్నిక్​తో మొక్కలు 30 రెట్లు ఎక్కువ వేగంగా పెరుగుతాయి కూడా. దాంతో మూడు నుంచి నాలుగేండ్లలో పదిరెట్లు పచ్చదనం పెరుగుతుంది. అందుకే ఈ టెక్నిక్​ గురించి తెలియగానే.. ప్రభుత్వ అధికారులని కలిసి, మియావాకి గురించి వివరంగా చెప్పాడు విశాల్​. వాళ్లని ఒప్పించి ఖాళీ  స్థలాల్లో మొక్కలు నాటాడు. అయితే దీనంతటికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు విశాల్​. కొన్ని గవర్నమెంట్​ ప్రాజెక్ట్స్​కి కూడా పని చేస్తున్నాడు. అలాగే తను ఎంచుకున్న ప్లేస్​ని బట్టి ఏ మొక్క నాటాలన్నది డిసైడ్​ అవుతాడు​. అంటే కొన్ని చోట్ల కేవలం పచ్చదనం కోసం.. ఇంకొన్ని చోట్ల చుట్టుపక్కలున్న పేదవాళ్లకి ఉపాధి చూపించడానికి పండ్ల మొక్కలు నాటతాడు. దీంతో పాటు  ఎన్జీవోలతో కలిసి మారుమూల గ్రామాలకి వసతుల్ని కల్పిస్తున్నాడు. నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ ద్వారా పేద పిల్లల్ని చదివిస్తున్నాడు కూడా. 

‘‘వానలు లేక రైతులు పడుతున్న కష్టాలు తెలిసినవే. రోజు రోజుకి కాలుష్యం, నీటి కొరత కూడా పెరిగిపోతోంది. వీటన్నింటికీ సొల్యూషన్​గా వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలనుకున్నా. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మూడు లక్షల మొక్కలు నాటా. ఇంకో లక్ష  మొక్కల పెంపకానికి గ్రౌండ్​ లెవల్​ వర్క్​ చేస్తున్నా. రానున్న రోజుల్లో మరిన్ని మొక్కలు పెంచుతా’’ అంటున్నాడు విశాల్​.