మేం అధికారంలోకి వస్తే.. ఇంటింటికీ 24 గంటలు నీళ్లు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేటీఆర్

మేం అధికారంలోకి వస్తే.. ఇంటింటికీ 24 గంటలు నీళ్లు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కేటీఆర్
  • కాంగ్రెస్ వచ్చాక మళ్లీ నీళ్ల లొల్లి మొదలైంది
  • ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కారు పేదలను మోసం చేసింది 
  • హైదరాబాద్​లో కొత్తగా ఒక్క ఇల్లు 
  • కట్టినట్టు నిరూపించినా.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్

కూకట్ పల్లి, వెలుగు: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ నగర ప్రజలకు 24 గంటలూ తాగునీరు అందిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, అధికారంలోకి రాగానే నగరంలో నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. సోమవారం కూకట్​పల్లిలోని ఎన్​కేఎన్​ఆర్ ఫంక్షన్ హాల్​లో జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బీఆర్ఎస్ రాకముందు వేసవి వస్తే ఖాళీ బిందెలతో ధర్నాలు జరిగేవని గుర్తుచేశారు. కేసీఆర్ ఉన్న పదేండ్లలో ఎప్పుడూ నీటి సమస్య రాలేదని.. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నగర ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. శనివారం వచ్చిందంటే చాలు బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చడానికి వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలను నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నగరంలో కొత్తగా ఒక్క ఇల్లయినా కట్టిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. 

ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రేవంత్ ప్రభుత్వం అలవికాని మాటలతో ప్రజలకు శఠగోపం పెట్టిందని, వీరికి బుద్ధి చెప్పడానికి జనం రెడీగా ఉన్నారన్నారు. నగరంలో నాలుగు వేల పడకల ఆస్పత్రులు కట్టించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్లలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, భవన నిర్మాణ కార్మికులకు బీఆర్ఎస్ మాత్రమే అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం: ఎమ్మెల్యే కృష్ణారావు
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కూకట్‌‌పల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఇక్కడి అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చిరు వ్యాపారుల డబ్బాలను కూలగొట్టడమే కాంగ్రెస్ నిత్యకృత్యంగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.