
- 24వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో రాజ్నాథ్ సింగ్
- దేశవ్యాప్తంగా ఘనంగా విజయోత్సవాలు
- అమర జవాన్లకు ముర్ము, మోదీ, నడ్డా, ప్రతిపక్ష నేతల నివాళులు
- రెచ్చగొడితే ఎంతకైనా తెగిస్తం
న్యూఢిల్లీ : దేశ గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైతే లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ) ను క్రాస్ చేస్తామని రక్షణ శాఖ మంత్రి హెచ్చరించారు. రెచ్చగొడితే, దేశాన్ని రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని, ఎంతకైనా తెగిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం 24వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ లోని ద్రాస్ సెక్టార్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల స్తూపానికి రాజ్ నాథ్ సింగ్ నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినపుడు జవాన్లకు డైరెక్టుగా మద్దతు ఇవ్వాలని పౌరులను ఆయన కోరారు. ఇందుకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే నిదర్శనమన్నారు. ఆ యుద్ధం మొదలై ఏడాదిపైనే అయిందని, రెండు దేశాల పౌరులు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారని తెలిపారు. ‘‘ఇండియా విషయంలో కూడా యుద్ధం లాంటి పరిస్థితి వస్తే జవాన్లకు మద్దతు ఇవ్వడానికి ప్రజలు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పటి వరకూ జరిగిన యుద్ధాల్లో ప్రజలు పరోక్షంగా సైన్యానికి అండగా నిలిచారు. అవసరమైతే యుద్ధ రంగంలోనూ అడుగుపెట్టి సోల్జర్లకు సహకరించాలి” అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. ఆపరేషన్ విజయ్ సమయంలో పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి మన దేశ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో బలమైన సందేశం పంపామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళి అర్పించారు. ‘‘1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం అశువులు బాసిన వీర జవాన్లకు ఈ జాతి తరపున నివాళి అర్పిస్తున్నాను. అమర జవాన్ల వీర గాధలు రాబోయే తరాలకు స్పూర్తినిస్తాయి. జై హింద్” అని ముర్ము ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు కార్గిల్ అమర వీరులు ఎప్పటికీ స్పూర్తి అని మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా అమర జవాన్లకు నివాళి అర్పించారు.
మన ఆర్మీ సత్తాను ప్రపంచం గుర్తించింది: యోగి
1999 కార్గిల్ యుద్ధ సమయంలో మన ఆర్మీ సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశంలోకి చొరబడిన పాకిస్తానీ చొరబాటుదారులను మన జవాన్లు విజయవంతంగా తరిమివేశాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీలు, నేతలు కూడా కార్గిల్ అమర జవాన్లకు అంజలి ఘటించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే.. ద్రాస్ లో కార్గిల్ అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. శ్రీనగర్ లో ఆర్మీ చీనార్ కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కూడా నివాళులర్పించారు.