అహ్మదాబాద్: తాతకు చెందిన పాతింటిని క్లీన్ చేస్తుండగా అదృష్టం వరించింది. చెత్త బుట్టలో పడేసిన చిత్తుకాగితాల్లో రూ.2.5 కోట్ల విలువ చేసే షేర్లు దొరికాయి. దీంతో ఇవి తనకే అంటూ మనవడు తీసుకెళ్లగా, నాకే చెందుతాయంటూ అతడి తండ్రి కోర్టుకెక్కాడు. అనుకోకుండా కలిసివచ్చిన ఈ అదృష్టం కాస్తా వారి కుటుంబంలో వివాదం రేపింది. గుజరాత్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై నవంబర్ 3న కోర్టు విచారించనుంది.
ఉనా గ్రామానికి చెందిన సావ్జీ పటేల్.. డయ్యూలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశాడు. వృద్ధాప్యంలో పటేల్ తన సొంతూరులోని ఇంట్లోనే గడిపి ఇటీవలే చనిపోయాడు. చనిపోయేముందు, తన ఆస్తి మొత్తం మనవడికేనని వీలునామా రాశాడు. ఈ క్రమంలోనే పటేల్ మనవడు ఉనాకు వెళ్లి తాత ఇంటిని క్లీన్ చేయిస్తుండగా, ఓ బుట్టలో పడేసి ఉన్న షేర్లు కనిపించాయి.
వాటిని ఆన్‌లైన్‌లో చెక్ చేయగా ప్రస్తుత విలువ రూ.2.50 కోట్లుగా తేలింది. విషయం తెలిసి ఆ యువకుడి తండ్రి కూడా అందులో వాటా కావాలని వాదించడంతో ఇరువురి మధ్యం వివాదం రాజుకుంది. దీంతో ఆ యువకుడి తండ్రి పిటిషన్ దాఖలు చేయగా.. నవంబర్ 3న విచారించేందుకు కోర్టు అంగీకరించింది.
