
- సబ్‌మెరైన్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని ట్రంప్ ఆరోపణ
- కరేబియన్ సముద్రంలో దానిని బాంబులతో పేల్చినట్లు వెల్లడి
న్యూయార్క్: కరేబియన్ సముద్రం నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ సబ్‌మెరైన్‌ను అమెరికా దళాలు బాంబులతో పేల్చేశాయి. అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండటంతోనే పేల్చిసినట్లు ప్రకటించాయి. ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని.. మరో ఇద్దరిని బంధించి వారి సొంత దేశాలైన కొలంబియా, ఈక్వెడార్‌కు అప్పగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. డ్రగ్స్ సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేయకపోతే దాని బారినపడి అమెరికాలో 25 వేల మంది చనిపోయేవాళ్లని, వాళ్ల ప్రాణాలను కాపాడామని ఆయన పేర్కొన్నారు.
సబ్‌మెరైన్‌పై బాంబులు వేసి పేల్చేస్తున్న దృశ్యాల వీడియోను పెంటగాన్తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. లాటిన్ అమెరికా దేశాల నుంచి కరేబియన్ సముద్రం గుండా కొన్నేండ్లుగా స్మగ్లర్లు డ్రగ్స్‌ను తరలిస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు తీరం వెంట అమెరికా బలగాలు గస్తీ కాస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వెనెజువెలా తీరంలోనే ఆరు డ్రగ్స్ పడవలను అమెరికా బలగాలు నీట ముంచేశాయి. ‘‘భారీ ఎత్తున డ్రగ్స్‌తో అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేయడం నాకు ఆనందంగా ఉంది. ఆ సబ్‌మెరైన్ అమెరికా ఒడ్డుకు చేరుకొని ఉంటే దాని ప్రభావంతో 25 వేల మంది అమెరికన్లు మరణించేవాళ్లు. దాన్ని ధ్వంసం చేయడం ద్వారా వారందరినీ కాపాడాం.
ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈక్వెడార్, కొలంబియాకు చెందిన మరో ఇద్దరు టెర్రరిస్టులను పట్టుకొని వారి దేశాలకు అప్పగించాం. కొలంబియాకు ఫండింగ్ ఆపేశాం” అని తన ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. దీన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు.
కాగా, కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఓ అక్రమ డ్రగ్ డీలర్ అని ట్రంప్ మండిపడ్డారు. ‘‘ఓవైపు మా దేశం నుంచి పెద్ద ఎత్తున సబ్సిడీలు పొందుతూ, మరోవైపు మా దేశానికి డ్రగ్స్‌ను అక్రమంగా చేరవేస్తూ, దీనిని పెట్రో ఓ వ్యాపారంగా మార్చుకున్నాడు. డ్రగ్స్ ఉత్పత్తిని ఆయన వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పెట్రోను ట్రంప్ హెచ్చరించారు.