దునియా మొత్తం.. 251 కోట్ల డోసుల టీకాలేసిన్రు

దునియా మొత్తం.. 251 కోట్ల డోసుల టీకాలేసిన్రు
  • రోజూ యావరేజ్‌‌‌‌గా 3.69 కోట్ల డోసులు  
  • చైనాలో 94 కోట్లు, అమెరికాలో 31 కోట్లు, మనదేశంలో 26 కోట్ల డోసుల పంపిణీ 
  • బ్లూమ్ బర్గ్ సంస్థ వెల్లడి  

న్యూయార్క్: దునియా మొత్తాన్నీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో అల్లకల్లోలం చేసేసింది కరోనా మహమ్మారి. అందరికీ టీకాలు వేయడం ఒక్కటే దీనికి ఫైనల్ సొల్యూషన్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నరు. మరి.. ఇప్పటిదాకా వ్యాక్సినేషన్ లో ఏ దేశం, ఎంత వరకు ముందుకెళ్లింది? ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని డోసుల టీకాలు పూర్తయ్యాయి? అంటే..180 దేశాల్లో 251 కోట్ల డోసుల కరోనా టీకాలను వేసినట్లు న్యూయార్క్ కు చెందిన బ్లూమ్ బర్గ్ మీడియా సంస్థ వెల్లడించింది. ఏయే దేశాల్లో ఎన్నెన్ని డోసుల టీకాలు వేశారన్న సమాచారాన్ని ఈ సంస్థ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది. శుక్రవారం నాటికి బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం.. మొత్తం 251 కోట్ల డోసులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ యావరేజ్ గా 3.69 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదే లెక్కన వ్యాక్సినేషన్ కొనసాగితే గ్లోబల్ ఇమ్యూనిటీ సాధించడానికి మరో ఏడాది కాలం పట్టనుంది. అమెరికాలో గతవారం రోజూ 13.3 లక్షల డోసులు వేశారు. ఇప్పటిదాకా 31.5 కోట్ల డోసుల టీకాలు పూర్తయ్యాయి. మనదేశంలో రోజూ యావరేజ్ గా 32 లక్షల డోసుల టీకా వేస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 26.86 కోట్ల డోసులు పూర్తయ్యాయి. ఇక మొత్తం ప్రపంచ జనాభా 780 కోట్లు అనుకుంటే.. ఇప్పటివరకూ 16.4% మందికి (రెండు డోసులు వేసినట్లుగా భావిస్తే) వ్యాక్సినేషన్ జరిగినట్లు లెక్క. అయితే వ్యాక్సినేషన్ లో పేద దేశాలు బాగా వెనకబడి ఉన్నాయి. వీటి కంటే సంపన్న దేశాలు 30 రెట్లు వేగంగా టీకాలు వేస్తున్నాయని బ్లూమ్ బర్గ్ సంస్థ వెల్లడించింది.