అమెరికాలో భారీ తుఫాన్.. 2 వేల 600 విమానాలు రద్దు

 అమెరికాలో భారీ తుఫాన్..  2 వేల 600 విమానాలు రద్దు

వాషింగ్టన్: తూర్పు అమెరికాలో భారీ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. టెనెస్సీ నుంచి న్యూయార్క్ దాకా పది రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. పిడుగులు, వడగండ్లు, సుడిగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చెట్టు విరిగి పడటంతో సౌత్ కరోలినాలోని ఆండర్సన్​​లో 15 ఏండ్ల బాలుడు చనిపోయాడు. పిడుగుపడి అలబామాలో 28 ఏండ్ల యువకుడు మరణించాడని పోలీసులు తెలిపారు.

 తుఫాన్ ఎఫెక్టుతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, డెలావేర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ, వెస్ట్ వర్జీనియాలోని 10 లక్షలకు పైగా ఇండ్లు, వ్యాపారాలకు కరెంట్ లేకుండా పోయింది. డెలావేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హాకెస్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరెంట్ స్తంభం పడి ఓ ఇల్లు కుప్పకూలింది. గాలులు వేగంగా వీస్తుండటంతో అమెరికావ్యాప్తంగా 2,600కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. 

మరికొన్ని విమానాలను దారిమళ్లించగా, 7,900 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మేరీల్యాండ్​లో కొద్దినిమిషాల్లోనే 10 సెం.మీ.వర్షపాతం నమోదైందని నేషనల్ వెదర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. తీర ప్రాంతాలకు వరదలు రావొచ్చని హెచ్చరికలు జారీ చేసింది.