ఇంజనీరింగ్​లో 28% సీట్లు ఖాళీ

ఇంజనీరింగ్​లో 28% సీట్లు ఖాళీ

మొత్తం 70,120 సీట్లకు 50,844 భర్తీ

ఆప్షన్లు ఇచ్చిన 2,777 మందికి సీట్లు రాలే
ముగిసిన ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. రాష్ర్ట వ్యాప్తంగా కన్వీనర్ కోటాలో మొత్తం 70,120 సీట్లుండగా… 50,844 (72.5 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. మరో 19,276 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల17లోగా స్టూడెంట్లు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. కాగా కొత్తగా ప్రవేశపెట్టిన 6 కోర్సులకు ఫైనల్ ఫేజ్​లోనూ పెద్దగా డిమాండ్ కనిపించలేదు. మొత్తం 181 ఇంజనీరింగ్ కాలేజీలు ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొన్నాయి. వీటిలో 167 ప్రైవేట్, 14 సర్కార్ కాలేజీలు ఉన్నాయి. 89,572 మంది ఎంసెట్ కు క్వాలిఫై కాగా, వీరిలో 58,142 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్​లో పాల్గొన్నారు. ఫైనల్ ఫేజ్​లో మొత్తం 39,182 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 36,308 సీట్లు అందుబాటులో ఉండగా.. 13,238 మందికి సీట్లు కేటాయించారు. ఫస్ట్ ఫేజ్ తో కలిపి మొత్తంగా 51,009 మంది స్టూడెంట్లకు సీట్లు కేటాయించారు. వీరిలో ఇంజనీరింగ్ కోర్సుల్లో 50,844 మందికి, ఫార్మసీ (ఎంపీసీ స్ర్టీమ్)లో 165 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. అయితే ఫైనల్ ఫేజ్​లో ఆప్షన్లు ఇచ్చిన 2,777 మంది స్టూడెంట్లు తక్కువ ఆప్షన్లు ఎంచుకోవడంతో వారికి సీట్లు రాలేదు.

సర్కార్ కాలేజీల్లో 98 శాతం భర్తీ

రాష్ర్టంలో 14 సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,150  సీట్లు ఉండగా.. 3,110 (98.7 శాతం) సీట్లు నిండాయి. కేవలం 41 సీట్లు మాత్రమే మిగిలాయి. 167 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 66,969 సీట్లుంటే… 47,734 (71.3శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. మరో 19,235 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. రాష్ర్టంలో మొత్తం 38 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండగా… వాటిలో 12 సర్కారు, 26 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. మరో 3 కాలేజీల్లో ఒక్క సీటు కూడా నిండలేదు.

ఫార్మసీలో 4.2 శాతమే…

ఫార్మసీ కాలేజీల్లో ఎంపీసీ స్టూడెంట్స్ కోసం కేటాయించిన సీట్లు పెద్దగా నిండలేదు. మొత్తం 119 కాలేజీల్లో 3,959 సీట్లుండగా… కేవలం 165 (4.2శాతం)  మాత్రమే నిండాయి. బీఫార్మసీలో 119 కాలేజీల్లో 3,409 సీట్లకు గాను 130 సీట్లు నిండగా… ఫార్మా డీలో 56 కాలేజీల్లో 550 సీట్లకు గాను 35 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

For More News..

నాపై కేసును కొట్టేయండి