గొర్రెల కోసం 28 వేల మంది ఎదురుచూపు

గొర్రెల కోసం 28 వేల మంది ఎదురుచూపు

గొర్రెల యూనిట్ల కోసం రూ.31వేలతో డీడీలు తీసిన్రు

స్కీమ్ కంటిన్యూ చేస్తమని కొడకండ్ల సభలో చెప్పిన సీఎం

ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వని కేసీఆర్

స్కీమ్ పేరిట తెచ్చిన అప్పులో ఇంక రూ.650 కోట్ల మిగిలే ఉన్నయ్​

అయినా ఎందుకివ్వట్లేదని ప్రశ్నిస్తున్న సంఘాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రెండేండ్లుగా ఆగిపోయిన గొర్రెల పంపిణీ స్కీమ్ మళ్ల స్టార్ట్ చేస్తమని ఇటీవల సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కొన్నాళ్లుగా గొర్రెల కాపరుల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల జనగామ జిల్లా కొడకండ్లలో జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవంలో స్కీమ్ కొనసాగిస్తామని చెప్పారు. గొర్రెల యూనిట్ల కోసం గుర్తించిన అర్హుల్లో ఇంకా 3.63లక్షల మంది ఎదురు చూస్తున్నరు. అలాగే యూనిట్ల కోసం డీడీలు కట్టిన 28వేల మంది గొర్రెల మేక పెంపకందార్లు తమకు పంపిణీ చేయాలని రెండేండ్లుగా ఆందోళనలు చేస్తున్నారు.

వడ్డీలకు తెచ్చి డీడీలు కట్టిన్రు….

రెండేండ్ల కింద గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున 28వేల మంది గొల్లకురుమలు డీడీలు తీశారు. వాళ్లకు ఇంకా గొర్లు ఇవ్వలేదు. గొర్రెల వస్తే బాగుపడుతమని కుటుంబ సభ్యుల బంగారం కుదువపెట్టి, వడ్డీలకు అప్పులు తెచ్చి డీడీలు కట్టారు. వాటికి వడ్డీలు కట్టలేక, సర్కారు గొర్లు రాక ఇబ్బందులు పడుతున్నరు. ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఈ స్కీమ్ తెచ్చారు తప్ప గొల్లకురుమలు బాగుపడాలనే ఉద్దేశం సర్కారుకు లేదని గొర్లకాపర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి.

రూ.650కోట్ల నిధులున్నా ఇవ్వట్లె..

స్కీమ్ కంటిన్యూ చేసేందుకు ఫండ్స్ ఉన్నా గొర్లు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ స్కీమ్ కోసం రాష్ట్రం ఎన్​ఎస్​డీసీ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు 3లక్షల 65వేల 682 యూనిట్లు అందించింది. తెచ్చిన ఫండ్స్​లో ఇంకా రూ.650 కోట్లు సర్కార్ వద్ద ఉన్నాయి. వీటితో డీడీలు కట్టిన వారికి గొర్లు పంపిణీ చేయొచ్చు.. కానీ సర్కార్ ఆ ప్రయత్నాలు చేస్తలేదు. అట్లనే స్కీమ్ కోసం రాష్ట్ర సర్కార్​ కోరితే ఇంకిన్ని అప్పులు ఇవ్వడానికి ఎన్‌‌ఎస్‌‌డీసీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఓట్ల కోసం తెచ్చిన స్కీమ్ కనుకే సర్కార్​పట్టించుకోవడం లేదని గొర్లు, మేకల పెంపకందార్లు ఆరోపిస్తున్నారు.