
- ఫలితాలు రిలీజ్ చేసిన నవీన్ మిట్టల్, లింబాద్రి
హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో 96.90% మంది క్వాలిఫై అయ్యారు. మంగళవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఎడ్ సెట్ చైర్మన్ నవీన్ మిట్టల్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. మొత్తం ఎడ్ సెట్‌కు 33,879 మంది రిజిస్టర్ చేసుకోగా.. 29,463 మంది పరీక్ష రాశారు. వీరిలో 28,549 మంది అర్హత సాధించారు.
అర్హత సాధించిన వారిలో 27,992 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కాగా, మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఎడ్ సెట్ టాపర్ గా ఎం. నవీన్ కుమార్ (నాగర్‌కర్నూల్), రెండో ర్యాంకు ఆశ్రిత నారాయణ్ (హైదరాబాద్), మూడో ర్యాంకు శ్రీతేజ (సికింద్రాబాద్), నాల్గో ర్యాంకు సాయి ప్రీతమ్ (మేడ్చల్ జిల్లా), ఐదో ర్యాంకు కె.రాజేందర్ రెడ్డి(మేడ్చల్ జిల్లా) సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 208 బీఈడీ కాలేజీలుండగా.. అందులో 20వేల సీట్లున్నాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి, నవీన్ మిట్టల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి ఏటా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే అమ్మాయిల సంఖ్య పెరుగుతుండటం సంతోషకరమన్నారు.