ప్రతి మహిళకు నెలకు 3 వేలు అందజేస్తం: కేటీఆర్

ప్రతి మహిళకు నెలకు 3 వేలు అందజేస్తం: కేటీఆర్
  • ప్రతి మహిళకు నెలకు 3 వేలు సౌభాగ్యలక్ష్మి పథకం కింద అందజేస్తం: కేటీఆర్ 
  • రైతుల కోసం రాష్ట్రాన్ని బాగు చేసుకున్నం
  • సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది
  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ రోడ్​ షోలో మంత్రి

చేవెళ్ల, వెలుగు:  మూడోసారి కేసీఆర్ సీఎం అయితే ఆడబిడ్డల కోసం కొత్తగా కార్యక్రమాలు చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి మాదిరిగానే సౌభాగ్యలక్ష్మి స్కీమ్​ను తెస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్లను రూ.2,016 నుంచి రూ.5,016 కు పెంచబోతున్నామన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. గత ఎన్నికల హామీ మేరకు 111 జీవో ఎత్తివేశామని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్​ పార్టీని ప్రజలు రెండుసార్లు ఆశీర్వదించగా.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. 


రైతులకు 24గంటల కరెంట్​ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. 75 ఏండ్ల దేశ చరిత్రలో ఏ నాయకుడికీ రాని ఆలోచన చేసి.. కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చారని చెప్పారు. ఈ పథకం కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమ చేశామన్నారు. రైతు వేదికలు నిర్మించి, రైతు సమన్వయ సమితిలు పెట్టి వ్యవసాయదారులను ఆర్గనైజ్​ చేసి ముందుకు పోతున్నామన్నారు. రైతుల కోసం రాష్ట్రాన్ని బాగుచేసుకున్నామన్నారు. 2018 ఎన్నికలప్పుడు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 111 జీవో ఎత్తివేస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట ప్రకారమే 111 జీవో తొలగించామని మంత్రి చెప్పారు. కొందరు న్యాయపరమైన చిక్కులు పెట్టే యత్నం చేసినప్పటికీ వాటన్నింటినీ సవరించామని, శాశ్వతంగా చేవెళ్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు మేలు జరిగేటట్లు చర్యలు తీసుకున్నామని వివరించారు. షాబాద్​ మండలం చందన్​వెళ్లి, సీతారాంపూర్​లో భారీ పరిశ్రమలు, శంకర్​పల్లి మండలం కొండకల్​లో రైల్వే పరిశ్రమ 
వచ్చిందని తెలిపారు. 

ఇంకిన్ని పథకాలు తెస్తం

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదన్న సీఎం కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడని కేటీఆర్ చెప్పారు. ‘‘నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ఏం కావాలన్నా కేసీఆర్​ను కలిసి నెరవేర్చే వ్యక్తి కాలె యాదన్న. చీమకు కూడా హాని చేయని మనిషి యాదన్న”అని కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గానికి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి కావాల్నా? కేసులున్న వ్యక్తి కావాల్నా? లేక గంగిగోవులాంటి కాలె యాదన్న కవాల్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. రెండుసార్లకే ఇన్ని పథకాలు తెచ్చిన సీఎం కేసీఆర్.. మరోసారి  సీఎం అయితే మరిన్ని అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడతారని కేటీఆర్ అన్నారు. కాలె యాదయ్య మాట్లాడుతూ ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అభివృద్ధి, రైతులు, మహిళలు, పేదల గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్​ సర్కారు వచ్చాక మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లానీరు అందించి మహిళల కష్టాలను తీర్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు.