
- ఒక్క టెక్స్‌టైల్ సెక్టార్‌లోనే లక్ష ఉద్యోగాలు పోయే ఛాన్స్
- ఎలక్ట్రానిక్స్, రొయ్యలు, ఆభరణాలు, ఆటో విడిభాగాల రంగాల్లోనూ అదే తీరు
- టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండదంటున్న కొంత మంది నిపుణులు
- ఇండియా వినియోగ ఆధారిత దేశమని, మన ఎగుమతులు తక్కువని వెల్లడి
న్యూఢిల్లీ: భారత వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించడంతో, ఇండియాలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా యూఎస్‌కు జరిపే ఎగుమతులపై ఆధారపడే రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇండియాలో వెంటనే ఉద్యోగ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కొంత మంది నిపుణులు హెచ్చరిస్తుండగా, మరికొందరు దేశీయ డిమాండ్, ఇతర దేశాలకు ఎగుమతులకు పెంచడం ద్వారా అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించొచ్చని భావిస్తున్నారు. “ఇటీవల అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లు భారత ఉద్యోగ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడే పరిశ్రమలు బాగా ప్రభావితమవుతాయి” అని జీనియస్ హెచ్‌ఆర్ టెక్ ఎండీ ఆర్‌పీ యాదవ్ పేర్కొన్నారు. టెక్స్‌టైల్, ఆటో విడిభాగాలు, వ్యవసాయం, రత్నాలు, ఆభరణాల రంగాలు ఎక్కువగా నష్టపోనున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈ) టారిఫ్‌ల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటాయి. ఒక్క టెక్స్‌టైల్ సెక్టార్‌లోనే లక్ష ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని యాదవ్ హెచ్చరించారు. ట్రంప్ టారిఫ్‌ల వలన మొత్తంగా 2– 3 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేశారు. “సూరత్, ముంబైలోని సీప్జ్ ఎకనామిక్ జోన్ వంటి ప్రాంతాల్లో ఉన్న రత్నాలు, ఆభరణాల యూనిట్లలో కూడా డిమాండ్ తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా కొనకపోతే లోకల్‌గా అమ్ముకోవచ్చు
మరోవైపు టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండదని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యన్ అనంత నారాయణన్ అన్నారు. “భారతదేశం ప్రధానంగా దేశీయ వినియోగంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ. చైనా లాగా కాదు. ప్రస్తుతానికి ఉద్యోగ నష్టం లేదా మందగమనం కనిపించడం లేదు. మన ఉద్యోగాలు ఎక్కువగా దేశీయ డిమాండ్‌ను తీర్చడానికే ఉన్నాయి. అమెరికాకు మన ఎగుమతులు సుమారు 87 బిలియన్ డాలర్లు. ఇది మొత్తం జీడీపీలో 2.2శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి” అని వివరించారు. ఈ టారిఫ్‌లు ఈ నెల చివర్లో అమల్లోకి రానున్నాయి. అప్పటిలోపు కొన్ని చర్చలు జరగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఇంకా యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) పూర్తయింది. ఇతర దేశాలతో కూడా ఇండియా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అమెరికా టారిఫ్‌లు అమలైనా, మనం వాణిజ్యాన్ని ఇతర మార్కెట్లకు మళ్లించే మార్గాలు కనుగొంటాం. అందువల్ల ప్రస్తుతం ఉద్యోగ నష్టం కనిపించడం లేదు.
త్వరలోనే మరింత స్పష్టత వస్తుంది” అని అనంత నారాయణన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడం, వినియోగం మందగించడం, టారిఫ్‌లపై అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ఉద్యోగ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. సియల్ హెచ్‌ఆర్ ఎండీ ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ, అమెరికా టారిఫ్‌లతో కొన్ని సెక్టార్లకు నష్టం తప్పదన్నారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, ఆభరణాలు, ఆటో విడిభాగాలు, లెదర్, షూస్, రొయ్యలు, ఇంజనీరింగ్ వస్తువులు వంటి రంగాలు అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. “ఫార్మాస్యూటికల్స్ లాంటి టారిఫ్‌లకు నేరుగా సంబంధం లేని రంగాలు కూడా రసాయనాలు, ముడి పదార్థాల ఖర్చు పెరగడం వల్ల ప్రభావితమవుతున్నాయి” అని మిశ్రా చెప్పారు. ఈ అనిశ్చితి డిసెంబర్ క్వార్టర్ వరకు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. “ఇప్పటికే కంపెనీలు ఖర్చు తగ్గించే దిశగా పనిచేస్తున్నాయి. ఉత్పత్తిని సరళీకృతం చేయడం, నియామకాలను నిలిపివేయడం జరుగుతోంది. తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగాలపై వెంటనే ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిలో వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి” అని చెప్పారు.
ఐటీ రంగంపైనా ఎఫెక్ట్..
ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(జీసీసీ) రంగాలపై కూడా ఈ టారిఫ్‌ల ప్రభావం కనిపించనుంది. ఐటీ రంగం ఇప్పటికే మందగమనంలో ఉంది. చాలా కంపెనీలు హైరింగ్ ఆపేశాయి. టారిఫ్‌లతో నియామకాలు మరింత తగ్గిపోవచ్చు. జీసీసీలు కూడా నియామకాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయని అంచనా. టారిఫ్ పరిస్థితి కొనసాగితే, అమెరికాలో భారత మార్కెట్ వాటా తగ్గే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎగుమతిదారులు, వాటిపై ఆధారపడే పరిశ్రమలు నష్టపోతాయి.