ముంబైలో గణపతి మండపానికి రూ.360 కోట్ల ఇన్సూరెన్స్​

ముంబైలో గణపతి మండపానికి రూ.360 కోట్ల ఇన్సూరెన్స్​

ముంబై :  రాబోయే గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ముంబైలో ఓ మండపానికి నిర్వాహకులు ఏకంగా రూ.360 కోట్లతో ఇన్సూరెన్స్​ చేయించారు. నగరంలోనే అత్యంత సంపన్నమైన మండపంగా గుర్తింపు పొందిన కింగ్స్ సర్కిల్‌‌లోని జీఎస్​బీ సేవా మండలి.. న్యూ ఇండియా అష్యూరెన్స్ ద్వారా రికార్డు స్థాయిలో ఈ పాలసీ చేయించింది. నిరుడు ఇదే మండలి రూ.316 కోట్లతో ఇన్సూరెన్స్​ చేయించింది. విగ్రహాన్ని అలంకరించే ఆభరణాల విలువ పెరిగినందున, గత ఏడాది కాలంగా బంగారం ధరలు పెరగడంతో ఇన్సూరెన్స్ మొత్తాన్ని సైతం పెంచారు. 

అయితే, ప్రీమియం ఎంత చెల్లించింది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది జీఎస్​బీ మండలిలో గణపతి విగ్రహాన్ని 66 కిలోల బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండితో అలంకరించనున్నారు. కాగా, ఈ ఇన్సూరెన్స్​ను 80 శాతం వాలంటీర్లు, సిబ్బంది కోసమే చేయించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రూ. 360 కోట్లలో.. బంగారం, వెండి వస్తువులు, ఆభరణాల కోసం వివిధ రకాల నష్టాలను కవర్ చేసేలా రూ.38.47 కోట్లతో ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. భూకంపం, ఫైర్​ యాక్సిడెంట్స్​కోసం రూ. 2 కోట్లతో ప్రత్యేక ప్రమాద పాలసీ తీసుకున్నారు. మండపం, భక్తుల భద్రత కోసం రూ.30 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించారు. 

అత్యధికంగా వాలంటీర్లు, సిబ్బంది వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కోసం రూ.289.50 కోట్లకు  బీమా చేయించారు. కాగా, ఈ బీమా 10 రోజుల పాటు భక్తులతో పాటు నిర్వాహకులకు వర్తిస్తుందని మండలి ట్రస్టీ అమిత్ పాయ్ తెలిపారు. మండపం వద్ద వాలంటీర్లు  షిఫ్టులలో పనిచేస్తారని, వారందరికీ ప్రమాద బీమా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా గణపతికి అలంకరించిన నగదు, విలువైన ఆభరణాల దోపిడీ వల్ల ఏర్పడే ఆర్థిక నష్టాన్ని కవర్ చేసేందుకు, అలాగే.. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, టెర్రరిస్టుల అటాక్​ వంటి ముప్పు నుంచి బయటపడేందుకు ఈ ఇన్సూరెన్స్​ చేయించినట్టు వెల్లడించారు. గణపతి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించడం తమ బాధ్యత అని అమిత్ పాయ్ పేర్కొన్నారు.