- జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు పొంచివున్న ముప్పు
- కూల్చకుండా అధికారుల నిర్లక్ష్యం
- సిబ్బంది కొరత, ఉన్నవారికి ‘సర్’ డ్యూటీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రమాదకర స్థితిలో ఉన్న పాత భవనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే నిర్వహించిన సర్వేలో మొత్తం 377 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించారు. జోన్‌ల వారీగా పరిశీలిస్తే శంషాబాద్‌లో 75, రాజేంద్రనగర్‌లో 117, చార్మినార్‌లో 56, గోల్కొండలో 47, ఖైరతాబాద్‌లో 12, సికింద్రాబాద్‌లో 70 ఉన్నాయి.
వీటిలో సగం వరకు భవనాలు పూర్తిగా ప్రమాదకరంగా ఉండటంతో కూల్చివేయాల్సిన అవసరం ఉందని అధికారులు తేల్చారు. మరికొన్ని భవనాలను వెంటనే ఖాళీ చేయించాలని, ఇంకొన్నింటికి అత్యవసర రిపేర్చేయించాలని సూచించారు. అయినా ఇప్పటివరకు చర్యలు లేవు. ప్రస్తుతం భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రమాదాలు జరగడం లేదని, వర్షాల తీవ్రత పెరిగితే ఈ శిథిల భవనాలు కూలిపోతాయని స్థానికులు భయపడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న పాత భవనాలు ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత ఉంది. పాత జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం మొత్తం 450 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 92 మంది పని చేస్తున్నారు. వీరు కూడా ‘సర్’ డ్యూటీలో బిజీగా ఉంటున్నారు. దీంతో ప్రమాదకర భవనాలపై తనిఖీలు, నోటీసుల జారీ, కూల్చివేత చర్యలను వేగంగా చేపట్టలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.
చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు
ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న భవనాల విషయంలో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలోచాలా ప్రమాదాలు జరిగాయి. జీహెచ్ఎంసీ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
