హైదరాబాద్, వెలుగు: అమ్మాయిలను వేధిస్తున్న ఆవారాలపై సిటీ షీ టీమ్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నాంపల్లి నుమాయిష్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజాలో జరిగిన కైట్ ఫెస్టివల్, చార్మినార్, అఫ్జల్‌గంజ్ బస్టాప్స్లో డెకాయ్ ఆపరేషన్స్ చేశారు. యువతులు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ నెలలో ఇప్పటివరకు 39 మంది పోకిరీలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీడియో రికార్డింగ్ ఆధారాలు అందించారు.
10 కేసుల్లో నిందితులుగా ఉన్న ఆవారాలకు నాంపల్లి కోర్టు 3 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. మూడు కేసుల్లో నిందితులను హెచ్చరించింది. మరో 26 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు. అమ్మాయిలను వేధించే ఆవారాల గురించి డైరెక్ట్‌గా లేదా వాట్సాప్ నంబర్ 9490616555, డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.
