రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ హుడా కాలనీలో విషాదం చోటుచేసుకొంది. ప్రమాద వశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల పాప మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ పరిధిలోని హుడా కాలనీలో నివసించే లక్ష్మీ శేఖర్ అనే దంపతులకు తేజశ్రీ, నిత్యశ్రీ (3) అనే ఇద్దరు కూతుళ్లు(కవలలు) ఉన్నారు. శుక్రవారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కూలీ పనికి వెళ్ళారు. సాయంత్రం సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న నిత్యశ్రీ ప్రమాద వశాత్తు నీటి సంపు లో పడి మృతి చెందింది. స్థానికులు గమనించి పాపను బయటకు తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో మృతి చెందింది. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి చేరిన పాప తల్లిదండ్రులు తమ బిడ్డ ఇక లేదని తెలిసి కన్నీరు మున్నీ రయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
