
శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తిగా నిండడంతో ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ 4 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే జూరాల జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో ఎగువ నుంచి పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్‌కు వచ్చిచేరుతోంది. శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తిగా నిండడంతో ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 4 గేట్లు ఎత్తి 1.06 లక్ష క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
మొదట 6వ నెంబర్ గేటను ఎత్తి, ఆ తర్వాత 7, 8, 9 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర 25వేల క్యూసెక్కుల చొప్పన మొత్తం 1.06 లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
డ్యామ్ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు రేపటి నుంచి పర్యాటకుల తాకిడి పెరగనుంది. రేపు ఎల్లుండి వీకెండ్స్ కావడంతో కృష్ణమ్మ పరవళ్లను కళ్లారా చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వెళ్లనున్నారు. ఎగువ నుంచి వరద కొనసాగడంతో పాటు కర్నాటక, మహారాష్ట్రలో ఇంకా వర్షాలు కురుస్తుండడంతో…శ్రీశైలం డ్యామ్‌కు వరద ఇలాగే కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు డ్యామ్ గేట్లు తెరచుకొనే ఉండే అవకాశముంది