
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ టైంలో మన సైన్యానికి సాయం చేసేందుకు ఇస్రో నుంచి 400 మందికిపైగా సైంటిస్టులు నిర్విరామంగా పనిచేశారని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. జాతీయ భద్రతా అవసరాల కోసం శాటిలైట్ ద్వారా అవసరమైన డేటాను యుద్ధభూమికి చేరవేసేందుకు వీరంతా రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలు పనిచేశారని చెప్పారు.
మంగళవారం (సెప్టెంబర్ 09) జరిగిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ నారాయణన్ ఈ విషయాలు గుర్తుచేశారు. మన దేశ పరిధిలో ఉన్న అన్ని ఉపగ్రహాలు పర్‌ఫెక్ట్‌గా పనిచేశాయని, సైన్యానికి కావాల్సిన అవసరాలను తీర్చాయని అన్నారు. మన దేశంలో తయారైన డ్రోన్లు, మిసైళ్లు, ఆకాశ్ తీర్ వంటి వెపన్ సిస్టమ్‌లను ఈ ఆపరేషన్ టైంలో విస్తృతంగా వినియోగించామని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌తో యుద్ధ సమయాల్లో అంతరిక్ష రంగ కీలక పాత్ర హైలైట్ అయిందన్నారు. మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు 7,700 గ్రౌండ్ టెస్టులు పూర్తి చేశామని తెలిపారు. 2027లో మిషన్ లాంచ్ అయ్యేనాటికి మరో 2,300 పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇస్రో మరో మూడు మానవ రహిత మిషన్‌లను నిర్వహించనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో మొదటిది, ఆపై మరో రెండు మిషన్‌లను చేపట్టనుంది.