పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ ‘నార్కోస్’ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఏడాది నిర్వహించిన 24 దాడుల్లో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 13.66 కోట్ల విలువైన 464.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, 43 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆలకుంట నవీన్ కుమార్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో భాగంగా రైళ్లలో, స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశామని, 2019 నుంచి ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఆర్పీఎఫ్కు లభించిన ప్రత్యేక అధికారాలతో డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులకు అనుమానాస్పద వ్యక్తులు లేదా యజమాని లేని బ్యాగులు కనిపిస్తే వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139కు సమాచారం అందించాలని సూచించారు.
