
- రెండున్నర లక్షల ఆప్షన్లు పెంచుకున్న అభ్యర్థులు
- 18న ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: టీజీఎప్ సెట్ మాక్ అలకేషన్ మంచి ఫలితాలను ఇస్తున్నది. మాక్ సీట్ల అలకేషన్లో కాలేజీలు, కోర్సులు నచ్చకపోవడంతో ఇప్పటికే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో సుమారు సగం మంది అభ్యర్థులు ఆప్షన్లు మార్చుకున్నారు. దీనికితోడు చాలామంది సీట్లు అలాట్ కాకపోవడంతో కొత్తగా ఆప్షన్లు పెంచుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మాక్ సీట్ల అలకేషన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎప్ సెట్ఫస్ట్ ఫేజ్ లో 95,256 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అటెండ్ కాగా, వారిలో 94,059 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
వీరు 56,63,308 వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు.అవగాహన కోసం మాక్ సీట్ల అలకేషన్ ఈ నెల12న చేశారు. దీంట్లో 77,154 మందికి మాత్రమే సీట్లు అలాట్ అయ్యాయి. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 16,905 మందికి సీట్లు అలాట్ కాలేదు. దీంతో ఈ నెల 14,15 తేదీల్లో ఆప్షన్ల మార్పుకు మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే, అభ్యర్థులకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్‌లు అలాట్ కాకపోవడంతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. దీనికి అనుగుణంగా భారీగానే వెబ్ ఆప్షన్లలో సవరణ చేసుకున్నారు.
వెబ్ ఆప్షన్లు పెరిగినయ్
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్న వారిలో మొత్తం 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. దీంట్లో సుమారు 200 మంది కొత్తగా ఆప్షన్లు ఇచ్చిన వారూ ఉన్నారు. అయితే, గతంలో ఇచ్చి మళ్లీ మార్చుకున్న వారు ఏకంగా 44,553 మంది ఉండడం గమనార్హం. వీరిలో కొందరు కాలేజీలు మార్చుకోగా, కొందరు కోర్సులు మార్చుకున్నారు. సీట్లు రాని వాళ్లు, నచ్చిన బ్రాంచి రాని వాళ్లు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చారు.
గతంలో 56.63 లక్షల ఆప్షన్లు ఉండగా, అది 59,31,279 వెబ్ ఆప్షన్లకు పెరిగింది. ఈ లెక్కన 2,67,971 ఆప్షన్లు పెరగడం గమనార్హం. దీంతో ఈసారి మరింత మందికి సీట్లు అలాట్ అయ్యే అవకాశం ఉంది. మాక్ అలాట్‌మెంట్‌లో సీటు రాని వారికి, కేటాయించిన కాలేజీలు, కోర్సులు నచ్చని వారికి తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి మరో అవకాశం కల్పించడంతో చాలా మందికి లబ్ధి చేకూరింది.