- సామాన్యులకు భారం కావొద్దు : మంత్రి దామోదర
- ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లు, అధికారులతో సమీక్ష
- ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కు అధిక ధరలపైనా సూచనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలపై నియంత్రణ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్య ఖర్చులు సామాన్యులకు భారం కాకుండా ఉండేందుకు.. ధరల నియంత్రణకు శ్రీకారం చుట్టామని ఆయన ప్రకటించారు. మంగళవారం సెక్రటేరియెట్ లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ పాలసీ రూపకల్పనపై ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ టారిఫ్ లు కంట్రోల్ లో ఉండాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కు సూచించారు. అవయవ దానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలన్నారు. విదేశాల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చేవారి విషయంలో పారదర్శకత కోసం నూతన విధివిధానాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్గాన్ డొనేషన్స్ యాక్ట్ కోసం ఒక సమగ్ర పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో హ్యాండ్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స కోసం కొత్తగా 4 హాస్పిటల్స్ కు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తో పాటు వివిధ ప్రముఖ ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
