డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా ఈవీ స్కూటీలు!

డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు ఫ్రీగా ఈవీ స్కూటీలు!
  • ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ స్టూడెంట్లకు పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు
  • దశలవారీగా అమలుకు ప్లాన్ 
  • సుమారు రూ.1,600 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమిక అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినులకు సుమారు 1.70 లక్షల ఈవీ స్కూటీలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి  ఉచిత ఈవీ స్కూటీల పథకంపై కీలక ప్రకటన చేశారు. దీంతో ఈ  కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేసేందుకు సర్కార్  ప్లాన్ రూపొందిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం అర్హులైన విద్యార్థినులకు వాహనాల కొనుగోలు కోసం సుమారు రూ.1,600  కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.

రానున్న వార్షిక బడ్జెట్ సమావేశాల్లోనే ఈ స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన, భద్రతతో కూడిన ఈవీ స్కూటీలకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని నెలల వ్యవధిలోనే ఈవీ స్కూటీలను సరఫరా చేయవచ్చు?  ఏయే రేట్లలో వాహనాలు అందుబాటులో ఉన్నాయి? పంపిణీకి ఎంత సమయం పడుతుంది? తదితర అంశాలపై అధికార వర్గాలు దృష్టి సారించాయి.

ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లక్షా 15 వేలు, సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీల్లో 28,500, గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో 12 వేల మంది ఇక ప్రభుత్వ ఇంజనీరింగ్​ కాలేజీల్లో 2,700 మంది దాకా విద్యార్థినులు ఉన్నట్టు ప్రాథమిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్స్​ లెక్కల ప్రకారం పంపిణీకి చేపట్టనున్నట్టు సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  

ముందు డిగ్రీ, బీటెక్​ విద్యార్థినులకే..

ఈవీ స్కూటీలకు ప్రభుత్వ కాలేజీల్లో చదివే డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థినులను ఈ పథకానికి ప్రాథమిక లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.  ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా 70  వేల మంది అర్హులైన విద్యార్థినులు ఉన్నట్టు తేలింది. ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ఉచితంగా బ్రాండెడ్ వాహనాలు అందించేందుకు.. స్కూటీల కొనుగోలుకు సుమారు రూ.1,600 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ ఒక అంచనాకు వచ్చింది.

ఆయా జిల్లాలు, మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్​ కాలేజీ విద్యార్థినులను ఎంపిక చేస్తూ, రానున్న బడ్జెట్ నుంచే ఈ పథకానికి నిధుల కేటాయింపులు ప్రారంభించనున్నారు.ఇక సీఎం ప్రకటనతో ఈవీ స్కూటీల పంపిణీకి  ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ప్రభుత్వం  స్టడీ చేస్తోంది.  సాధారణంగా మన ఇండియన్ మార్కెట్లో చైనా విడిభాగాలతో తయారయ్యే బేసిక్ మోడల్స్ రూ.60 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.

కానీ, విద్యార్థినులు రోజూ కాలేజీలకు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాలంటే ఆ తక్కువ ధరల బండ్ల నాణ్యత ఏమాత్రం సరిపోదు. ఒక మంచి బ్రాండెడ్ ఈవీ స్కూటీ కొనాలంటే రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలు దాటుతుంది. బజాజ్, టీవీఎస్, ఏథర్, ఓలా లాంటి ప్రముఖ కంపెనీల నాణ్యమైన మోడళ్ల రేట్లు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉన్నాయి. 

పెట్రోల్​ భారం లేకుండా ఈవీ

విద్యార్థినులపై రోజువారీ పెట్రోల్ భారం పడకూడదనే ముందుచూపుతో పర్యావరణ హితమైన ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)’ను ఎంచుకున్నారు. దీంతో కర్భన ఉద్గారాలు, కాలుష్య నియంత్రణకు కూడా పరోక్షంగా పెద్దపీట వేసినట్టు అవుతుంది. బ్యాటరీ వారంటీ, మూడేండ్ల ఉచిత సర్వీసింగ్ బాధ్యతలను సైతం సరఫరా చేసే కంపెనీలకే అప్పగించేలా టెండర్ల ప్రక్రియలో కఠిన నిబంధనలు పొందుపరచనున్నారు. ఈ పథకంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని, చార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించినట్టు అవుతుందని  ప్రభుత్వం భావిస్తున్నది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమంది అమ్మాయిలు కళాశాలలు దూరంగా ఉండటం, బస్సు సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ డ్రాపౌట్స్ శాతాన్ని పూర్తిగా అరికట్టి, ఉన్నత విద్యాసంస్థల్లో మహిళల నమోదును పెంచవచ్చని కూడా ప్రభుత్వం భావిస్తోంది.