కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్స్ను టీచర్ చితకబాదిన ఘటన మంగళవారం జరిగింది. స్టూడెంట్ సాత్విక్, అతడి తల్లి సంజన తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వివేకానంద రోడ్ కాలనీకి చెందిన సాత్విక్(11) పట్టణంలోని గౌతమ్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు.
మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన సాత్విక్ క్లాస్ రూంలో ఇద్దరు స్టూడెంట్స్ తనను సతాయిస్తున్నారని, స్కూల్‌కు వెళ్లనని మారాం చేశాడు. దీంతో తల్లి సంజన కొడుకును తీసుకొని స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌కు కంప్లైంట్చేసింది. ఆ తర్వాత స్టూడెంట్స్ క్లాస్ రూంలో అల్లరి చేయడంతో ఓ టీచర్ ముగ్గురు స్టూడెంట్స్ను మందలించి కర్రతో చితకబాదింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన సాత్విక్ తల్లికి ఈ విషయం చెప్పడంతో ఒంటి నిండా గాయాలు ఉండడంతో విస్తుపోయింది. వెంటనే స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సంజన తెలిపింది. టీచర్‌పై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.
