V6 News

గణపతి లొంగిపోతారని భావిస్తున్నాం..పీఎల్జీఏ అంతరించింది: డీజీపీ శివధర్రెడ్డి

గణపతి లొంగిపోతారని భావిస్తున్నాం..పీఎల్జీఏ అంతరించింది: డీజీపీ శివధర్రెడ్డి
  • దక్షిణ చత్తీస్‌గఢ్‌ మావోయిస్టు రహిత ప్రాంతమైందని వ్యాఖ్య
  • 47 మంది మావోయిస్టులు సరెండర్

హైదరాబాద్‌, వెలుగు: మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి త్వరలోనే లొంగిపోతారని భావిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న నలుగురు మినహా.. తెలంగాణకు సంబంధించిన మావోలు సరెండర్​అయ్యారని తెలిపారు. దక్షిణ చత్తీస్‌గఢ్‌ కూడా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని చెప్పారు. ములుగు, భద్రాచలం కేంద్రాలుగా పనిచేస్తున్న దక్షిణ బస్తర్‌‌కు చెందిన 47 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. ఎల్‌ఎమ్‌జీ, 4 ఏకే 47లు సహా మొత్తం 32 ఆయుధాలు, 515 తూటాలను పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ లా అండ్‌ ఆర్డర్ డీజీ మహేశ్‌ భగవత్‌, ఎస్‌ఐబీ చీఫ్‌ సుమతి, గ్రేహౌండ్స్ డీజీ అనిల్‌కుమార్‌‌తో కలిసి వివరాలు వెల్లడించారు. 

అజ్ఞాతంలో ఉన్నది నలుగురే..

రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో మావోయిస్టు పార్టీ సెంట్రల్, స్టేట్​కమిటీల అగ్రనేతలు ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలిశారని, తెలంగాణకు సంబంధించి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్‌ సంతోష్, జాడె రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్‌‌ అలియాస్ మంగ్తు మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వీరంతా ఇతర రాష్ట్రాల కమిటీల్లో పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న చత్తీస్‌గఢ్​మావోయిస్టులు రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్‌‌డివిజనల్‌ కమిటీ ఇన్‌చార్జి హేమ్లా ఐతు అలియాస్ పోడియం లచ్చు సహా 27 మంది స్పెషల్ జోనల్‌ కమిటీ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) బెటాలియన్‌కు చెందిన నలుగురు, సౌత్ బస్తర్‌‌ డీవీసీ 9, 30 ప్లాటూన్‌కు చెందిన 16 మంది సహా మొత్తం 47 మంది లొంగిపోయినట్లు తెలిపారు. పీఎల్ జీఏ అంతరించిందన్నారు. మావోయిస్టుల సరెండర్​విషయంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ పోలీసులను  అభినందించారు.

రెండేండ్లలో 818 మంది లొంగుబాటు 

గత 4 నెలల వ్యవధిలోనే 260 మంది జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ చెప్పారు. 2024 నుంచి ఇప్పటికి వివిధ కేడర్లకు చెందిన మొత్తం 818 మంది లొంగిపోయారని, వారి వద్ద నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సరెండర్​అయిన మావోయిస్టులందరికీ త్వరలోనే హెల్త్‌ కార్డులు ఇస్తామని తెలిపారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రివార్డులు కలిపి మొత్తం రూ.1.50 కోట్లు అందించామని వెల్లడించారు. పునరావస పథకం కింద అన్ని సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.