కేంద్ర ఉద్యోగులకు 5%  డీఏ

కేంద్ర ఉద్యోగులకు 5%  డీఏ

దీపావళి కానుకగా
ప్రకటించిన మోడీ సర్కార్
50 లక్షల మంది ఉద్యోగులు,
65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి
సర్కారుపై 16వేల కోట్ల భారం
పీఎం కిసాన్​కు ఆధార్​ సీడింగ్ నిబంధన​సడలింపు
కేంద్ర కేబినెట్​​ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్​ గుడ్​న్యూస్​ చెప్పింది. ఉద్యోగులకు డియర్‌‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనం అందుతుందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ మీడియాకు వెల్లడించారు. డీఏ పెంపుతో50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. 2019, జులై 1 నుంచే పెరిగిన డీఏని లెక్కగడతారు.  తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగులకు అందే డీఏ శాతం 12 నుంచి 17 శాతానికి పెరిగినట్లైంంది. దీనివల్ల కేంద్ర సర్కారుపై రూ.16వేల కోట్ల భారం పడనుంది.  కేంద్ర డీఏను ఏడాదికి రెండు సార్లు సవరిస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లలో ఇదే అతిపెద్ద పెంపు కావడం గమనార్హం. ‘‘దీపావళి కానుకగా 5 శాతం డీఏ పెంపు వల్ల ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అదనపు భారాన్ని భరించడానికి ముందుకొచ్చాం’’అని మంత్రి జవదేకర్​ అన్నారు. దేశ ఆర్థిక ప్రగతి నెమ్మదించిన నేపథ్యంలో కొనుగోళ్లను మరింతగా ప్రోహించడానకే కేంద్రం ఈ సారి డీఏను భారీగా పెంచెందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఆశా వర్కర్ల జీతం రెట్టింపు

దేశవ్యాప్తంగా ఆశా వర్కర్ల జీతాలను రూ.1000 నుంచి రూ.2000కు పెంచుతున్నట్లు మంత్రి జవదేకర్​ ప్రకటించారు. గ్రామీణ స్థాయిలో కేంద్ర సంక్షేమ పథకాల అమలులో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని, వాళ్ల సేవలను విస్మరించొద్దన్న ఉద్దేశంతోనే గౌరవ వేతనాన్ని రెంట్టింపు చేసినట్లు చెప్పారు.

ఆధార్​ లేకున్నా పీఎం కిసాన్​ డబ్బులు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్​) పథకం కింద ఆర్థిక సహాయాన్ని పొందుతున్న రైతులకు తాజాగా మరో వెసులుబాటు కల్పించినట్లు జవదేకర్ తెలిపారు. రైతుల బ్యాంక్​ అకౌంట్లకు ఆధార్​ అనుసంధానం(సీడింగ్​) పూర్తికాకున్నా రెండో విడత డబ్బును అందజేస్తామని చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆధార్​ సీడింగ్​ నిబంధనను నవంబర్​30 వరకు సడలిస్తున్నామని, రబీ సీజన్​లో రైతులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. డిసెంబర్​1 నుంచి సీడింగ్​ నిబంధనలు మళ్లీ అమల్లోకి వస్తాయన్నారు. పీఎం కిసాన్​ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మంది రైతులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతల్లో కేంద్రం చెల్లిస్తోంది.

ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షలు

దేశ విభజన తర్వాత(1948లో) పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు వన్​ టైమ్​ సెటిల్మెంట్​ పద్ధతిలో రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. పీవోకే నుంచి వచ్చిన ఈ 5,300 కుటుంబాలు జమ్మూ కశ్మీర్‌‌కి బయటి రాష్ట్రాల్లో సెటిల్​ కావడంతో ‘లోకల్​ జాబితా’లో చోటు దక్కలేదని, ఇప్పుడు వీళ్లందరినీ లబ్ధిదారుల జాబితాలో చేర్చడం ద్వారా చారిత్రక తప్పిదాన్ని సరిచేసినట్లయిందని, పీఎం డెవలప్​మెంట్​ ప్యాకేజీ కింద ఈ పరిహారాన్ని అందజేస్తామని జవదేకర్​ చెప్పారు.