IPL 2024: కుర్రాళ్లదే హవా: ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న యువ క్రికెటర్లు

IPL 2024: కుర్రాళ్లదే హవా: ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న యువ క్రికెటర్లు

ఐపీఎల్ అంటే స్టార్స్ తో కళకళలాడుతుంది. ఈ మెగా లీగ్ లో అందరి దృష్టి స్టార్ ఆటగాళ్లపైనే ఉంటుంది. యంగ్ ప్లేయర్లను పట్టించుకునే వారే లేరు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఇండియన్ ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్ల ఆట చూడడానికి క్రికెట్ ప్రేమికులు బాగా ఆసక్తి చూపిస్తారు. అయితే ప్రస్తుత సీజన్ లో మాత్రం అలా కనిపించడం లేదు. కుర్రాళ్లే దుమ్ము రేపుతున్నారు. ప్రతి సీజన్ లో ఒకరిద్దరు యువ ప్లేయర్లు వెలుగులోకి వస్తే.. ఈ సారి మాత్రం ఆ సంఖ్య బాగా పెరిగింది. 

శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ:

ప్రస్తుత సీజన్ లో పంజాబ్ పెద్దగా రాణించకపోయినా.. ఆ జట్టులోని శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ తమ ఆట తీరుతో అందరిని తమ వైపుకు తిప్పుకున్నారు. భారీ హిట్టింగ్ తో పాటు నిలకడగా ఆడుతూ పంజాబ్ జట్టుకు ఆశాకిరణంలా మారారు. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ తో పంజాబ్ చివరి రెండు మ్యాచ్ లు ఆడింది. వీటిలో గుజరాత్ పై ఓడిపోయే మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శశాంక్ సింగ్ కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిస్తే.. చివర్లో ఆశుతోష్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినా తమ మెరుపులతో ముచ్చెమటలు పట్టించారు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో తమని తాము నిరూపించుకున్న వీరిద్దరూ ఐపీఎల్ మరిన్ని మ్యాచ్ లు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. 

రియాన్ పరాగ్:

పరాగ్ ఐపీఎల్ కు కొత్త కాకపోయినా తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అసలు పనికిరాడనుకుని ట్రోల్స్ కు గురైన వాడే ఇప్పుడు రాజస్థాన్ కు ఒంటి చేత్తో విజయాలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ ల్లో 261 పరుగులు చేసిన పరాగ్.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఢిల్లీపై  మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడి సమయంలో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ముంబైపై జరిగిన మ్యాచ్ లోనూ స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. మ్యాచ్ చివరి వరకు క్రీజ్ లో ఉండి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. ఇక తాజాగా నిన్న (ఏప్రిల్ 10) గుజరాత్ టైటాన్స్ పై 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పరాగ్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే టీ20 వరల్డ్ కప్ లో చోటు ఖాయంగా కనిపిస్తుంది. తుది జట్టులో అవకాశం రాకపోయినా 15 మంది స్క్వాడ్ లో ఉండొచ్చు.
 
మయాంక్ యాదవ్:

ఈ ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లలో మయాంక్ యాదవ్ ప్రధమ స్థానంలో ఉంటాడు. లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్న ఎక్స్ ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గంటకు నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో పాటు.. ఖచ్చితత్వం కూడిన లైన్ లెంగ్త్ బంతులు వేయడం మయాంక్ స్పెషాలిటీ. ధావన్, బెయిర్ స్టో, మ్యాక్స్ వెల్, పటిదార్ లాంటి స్టార్ ఆటగాళ్లు సైతం ఈ 21 ఏళ్ళ పేస్ ధాటికి సమాధానం లేకుండా పోయింది. ఇప్పటివరకు 2 మ్యాచ్ లాడిన ఈ యంగ్ బౌలర్ 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకున్నాడు. గాయం కారణంగా చివరి రెండు ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. 

నితీష్ కుమార్ రెడ్డి: 

తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఒక్క మ్యాచ్ తో తనలోని పరిణితి చూపించాడు. పంజాబ్ పై ఒత్తిడిలో స్టార్ ఆటగాళ్లందరూ విఫలమైనా ఒక్కడే వారియర్ లా పోరాడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మొదట్లో అచ్చితూచి ఆడిన ఇతను  ఒక్కసారిగా గేర్ మార్చిన నితీష్.. పూనకమొచ్చినట్లు పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  భారీ బౌండరీలతో హడలెత్తించాడు. దీంతో 150 పరుగులు చేయడమే గొప్ప అనుకున్న తరుణంలో జట్టు స్కోరు 180కి చేరుకుందంటే.. అది నితీష్ పోరాటం వల్లే జరిగింది.  మొత్తం 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీస్ మెరుపు ఇన్నింగ్స్ తో ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది.