రాబోయే 5 ఏళ్లు గ్యాస్ కష్టాలు తప్పవా.. ధరలు భారీగా పెరుగుతాయా.. ఖతార్ ఏం చెబుతోంది..!

రాబోయే 5 ఏళ్లు గ్యాస్ కష్టాలు తప్పవా.. ధరలు భారీగా పెరుగుతాయా.. ఖతార్ ఏం చెబుతోంది..!

ముదిరిన ఇరాన్ వార్ ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఇరాన్ జరిపిన తాజా క్షిపణి దాడులతో ప్రపంచంలోనే అతిపెద్ద LNG ఎగుమతిదారులలో ఒకటైన ఖతార్‌ భారీగా దెబ్బతింది. ఖతార్‌లోని రస్ లఫ్పాన్ ఇండస్ట్రియల్ సిటీపై జరిగిన ఈ దాడుల వల్ల ఆ దేశ ఎగుమతి సామర్థ్యం 17 శాతం మేర పడిపోయింది. దీనివల్ల ఖతార్‌కు ఏటా సుమారు 20 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.లక్షా 80వేల కోట్లు ఆదాయ నష్టం వాటిల్లనుందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ షెరిడా అల్-కాబీ వెల్లడించారు.

ఈ దాడుల్లో ప్రధానంగా ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి యూనిట్లు అయిన ట్రైన్ 4, ట్రైన్ 6 తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటి ద్వారా ఏడాదికి 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ భారీ నష్టాన్ని పూడ్చుకోవడానికి.. దెబ్బతిన్న ప్లాంట్లను పునరుద్ధరించడానికి కనీసం 5 ఏళ్లు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కొన్ని దీర్ఘకాలిక ఒప్పందాలపై ఖతార్ 'ఫోర్స్ మెజ్యూర్' అంటే అనివార్య కారణాల వల్ల సరఫరా నిలిపివేత ప్రకటించాల్సి వస్తోంది. కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా.. షెల్ కంపెనీ నిర్వహిస్తున్న పెర్ల్ జిటిఎల్ ప్లాంట్ కూడా దెబ్బతినడంతో ఇతర అనుబంధ ఉత్పత్తులైన కండెన్సేట్స్, ఎల్‌పీజీ, హీలియం ఉత్పత్తి కూడా భారీగా తగ్గనుందని వెల్లడైంది.

భారతదేశంపై దీని ప్రభావం విషయానికొస్తే.. మన దేశం తన అవసరాలకు కావాల్సిన ఎల్‌ఎన్‌జీలో దాదాపు 40 శాతానికి పైగా ఖతార్ నుండే దిగుమతి చేసుకుంటోంది. ఖతార్ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే.. భారతీయ ఇంధన కంపెనీలు స్పాట్ మార్కెట్‌లో అధిక ధరలకు గ్యాస్ కొనాల్సి వస్తుంది. ఇది దేశీయంగా గ్యాస్ ధరలు పెరగడానికి, తద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, రవాణా రంగాలపై అదనపు భారం పడటానికి దారితీస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఒప్పందాల కింద వచ్చే గ్యాస్ సరఫరా తగ్గితే.. భారత పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గేవరకు ఉత్పత్తిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం సాధ్యం కాదని ఖతార్ స్పష్టం చేసింది. ఈ పరిణామం యూరప్, ఆసియాలోని ప్రధాన దిగుమతి దేశాలైన చైనా, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తున్న వేళ.. ఈ దాడి ప్రభావం అంతర్జాతీయంగా గ్యాస్ ధరల పెరుగుదలకు సంకేతంగా కనిపిస్తోంది.