ఇదీ యోగి ఇలాకాలో పరిస్థితి.. 60వేల పోలీస్ ఉద్యోగాలకు.. 50 లక్షల మంది దరఖాస్తు

ఇదీ యోగి ఇలాకాలో పరిస్థితి..  60వేల పోలీస్ ఉద్యోగాలకు.. 50 లక్షల మంది దరఖాస్తు

యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో 60,244 కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 50లక్షల యువకులు దరఖాస్తు చేస్తున్నారు. ఈ స్థాయిలో ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (యూపీపీఆర్పీబీ)కి అప్లికేషన్స్ రావడం ఇదే మొదటిసారి. 2009లో యూపీపీఆర్పీబీ ఏర్పడినప్పట్నుంచి ఇన్ని అప్లికేషన్స్ రావడం ఇదే తొలిసారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 27, 2023న ప్రారంభమైంది. 12వేల రిజర్వేషన్ సీట్ల కోటాకు వ్యతిరేకంగా మరో 15లక్షల మంది మహిళలు అప్లై చేసుకున్నారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 16న ముగిసింది. జనవరి 20వరకు ఫీజు అడ్జస్ట్మెంట్, దరఖాస్తులో సవరణల కోసం సమయమివ్వగా.. అది కూడా నిన్నటితో ముగిందని యూపీపీఆర్పీబీ డీజీ రేణుకా మిశ్రా తెలిపారు. రికార్డుల స్థాయిగా దరఖాస్తులు రావడంతో షిఫ్టుల వారిగా పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దాదాపు 32లక్షల అప్లికేషన్లు వస్తాయని బోర్డు అంచనా వేసిందని, ఫిబ్రవరి 18న జరగబోయే ఈ పరీక్షల కోసం 6వేల 500 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పుడు 50లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో 2,3షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మొత్తం ఒక్కో పోస్ట్ కు దాదాపు 83మంది పోటీపడుతున్నారని, అప్లై చేసిన వారిలో సుమారు 35లక్షల మంది పురుషులు, 15లక్షల మందికి పైగా మహిళలన్నారని మిశ్రా తెలిపారు. అంటే ఒక పోస్టుకు పురుషుల విభాగంలో 66మంది పోటీదారులు, మహిళల్లో 125మంది ఉన్నారని చెప్పారు. మొదటి సారి మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని, ఈ రిక్రూట్మెంట్ తర్వాత యూపీ పోలీసుల్లో అత్యధిక సంఖ్యలో మహిళా పోలీసులు ఉండే అవకాశముందని చెప్పుకొచ్చారు.

ఒకే సారి ఇంతమంది అభ్యర్థులు అప్లై చేయడంతో.. ఇంత పెద్ద ఎత్తున పరీక్షలను నిర్వహించడం తమకు పెద్ద సవాలుగా మారిందని కూడా యూపీపీఆర్పీబీ డీజీ చెప్పారు. అదనపు ఏర్పాట్లను నిర్వహించడానికి బోర్డు.. రైల్వే, రోడ్ వేస్ అధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తోంది. జోన్ 4,844కేంద్రాలు, కమిషనరేట్ లో 1,640కేంద్రాలను బోర్డు ప్రతిపాదించింది. లక్నోలో అత్యధికంగా 832కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో పాటు పరీక్ష సమయంలో అనుమానితులను గుర్తించడానికి ఏఐ వంటి కృత్రిమ మేధస్సు సహాయం కూడా బోర్డు తీసుకోనుంది. ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో కాపీయింగ్ ను నిరోధించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ ప్రధాన కార్యాలయం ఇంతకు మునుపే వెల్లడించింది.