సరైన కథ, కథనాలతో ప్రేక్షకులను మెప్పించాలే కానీ.. హై బడ్జెట్, స్టార్ కాస్టింగ్, కమర్షియల్ హంగులేమీ లేకున్నా భారీ విజయాలు సాధించవచ్చని ఓ గుజరాతీ చిత్రం మరోసారి నిరూపించింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు రూ.100 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.
ఆ చిత్రమే ‘లాలో – కృష్ణ సదా సహాయతే’. కరణ్ జోషి, రీవా రచ్, శ్రుహద్ గోస్వామి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రానికి అంకిత్ సఖియా దర్శకుడు. అక్టోబర్ 10న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి తొలివారం ఆదరణ దక్కలేదు. కేవలం రూ.26 లక్షలు వసూలు చేసింది. తొలివారం సినిమా చూసిన ప్రేక్షకులే ఈ సినిమాకు ప్రచారకులు అయ్యారు. రెండో వారానికి మౌత్ టాక్‌తో వసూళ్లు పుంజుకున్నాయి. నాలుగో వారానికి అనూహ్యమైన వసూళ్లు మొదలయ్యాయి. ఆరో వారం ముగిసేసరికి రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఏడో వారంలోనూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోది.
త్వరలో వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి గుజరాతీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. ఇప్పటివరకు అక్కడ రూ.50 కోట్లు రాబట్టిన సినిమా ఒకటే ఉంది. ‘చాల్ జీవి లాయియే’ (2019) అనే చిత్రం రికార్డును బ్రేక్ చేసి.. తొలి వంద కోట్ల గుజరాతీ సినిమాగా నిలవబోతోంది. ఈ చిత్ర విజయంతో హిందీలో డబ్ చేస్తున్న మేకర్స్.. ఈనెల 28న దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
కృష్ణతత్వమే కథగా..
తప్పుల్లో కూరుకుపోయిన మనిషిని భగవంతుడు ఎలా బయటకు తీసుకొచ్చి దారిలో పెట్టాడనేది ప్రధాన కథ. లాలో (కరణ్ జోషి) అనే రిక్షా డ్రైవర్ కథ ఇది. భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను అనుకోకుండా ఓ ఫామ్ హౌస్‌లో చిక్కుకుపోతాడు. తన ఒంటరితనం, గతం తాలూకు జ్ఞాపకాలు, బాధలతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఆ నిస్సహాయ స్థితిలో అతనికి ఓ వెలుగు కనిపిస్తుంది.
అదే శ్రీకృష్ణుడు (శ్రుహద్ గోస్వామి). రెగ్యులర్‌గా సినిమాల్లో చూసే మిరాకిల్స్ ఏవీ ఆయన చేయడు కానీ అతనికి తప్పులు సరిదిద్దుకునే ధైర్యాన్ని ఇస్తాడు. జీవితం పట్ల ఓ ఆశని కలిగిస్తాడు. గ్రాఫిక్స్‌లో కృష్ణుడి రూపాన్ని చూపించడం కాకుండా.. ఒక మనిషిగా మనం ఎలా జీవించాలో, ఎలా జీవించ కూడదో అనే కృష్ణతత్వాన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులకు అది బాగా కనెక్ట్ అయింది. భారీ బడ్జెట్‌తో కాదు.. గొప్ప కథతో సినిమా తీయాలని ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది.
