క్యూర్‌‌‌‌లో నియోజకవర్గానికి 500 ఇండ్లు..పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి 

క్యూర్‌‌‌‌లో నియోజకవర్గానికి 500 ఇండ్లు..పది అంతస్తులతో ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి 
  • ఈ నెల 28లోగా లొకేషన్లు ఖరారు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గురువారం సెక్రటేరియట్‌‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్‌‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై అధికారులతో మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 వరకు స్థలాలు గుర్తించామని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను స్పీడప్ చేసి ఈ నెల 28లోగా అన్ని లొకేషన్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. 

త్వరలో విధివిధానాలు ప్రకటిస్తం.. 

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్‌‌ను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. క్యూర్ పరిధిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామని, ఈ స్థలాల్లో అన్‌‌డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌‌లో ఆర్డీవోలు, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఆర్డీవోలు, తహసీల్దార్ కార్యాలయాల భవనాల మరమ్మతులకు సంబంధించి హౌసింగ్ ఏఈలు భవనాలను విజిట్ చేసి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్‌‌ పాల్గొన్నారు.