కోరుట్ల: 52 రోజుల నిరీక్షణకు తెర...ఎట్టకేలకు బీటెక్ స్టూడెంట్ రాహుల్ అస్తికలు అప్పగింత

కోరుట్ల: 52 రోజుల నిరీక్షణకు తెర...ఎట్టకేలకు బీటెక్ స్టూడెంట్ రాహుల్ అస్తికలు అప్పగింత
  •     స్వగ్రామంలో అంత్యక్రియలు చేసిన కుటుంబసభ్యులు

కోరుట్ల, వెలుగు: ఏపీలో అనుమానాస్పదంగా మృతిచెందిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ కు చెందిన బీటెక్ స్టూడెంట్ అంకం రాహుల్ (21) అస్తికలు ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నాయి. రాహుల్ తండ్రి రాజేశ్వర్ అంత్యక్రియలు నిర్వహించారు. రాహుల్ ది ముమ్మాటికి హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదీ జరిగింది.. హైదరాబాద్​లోని ఓ కాలేజీలో బీటెక్​ థర్డియర్ చదువుతున్న రాహుల్ మే నెల 27న హాస్టల్ ​నుంచి వెళ్లి కనిపించకుండాపోయాడు.

ఇదిలా ఉండగా మే 30న ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని ఓ బావిలో గుర్తుతెలియని డెడ్​బాడీ లభించడంతో కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు మృతదేహన్ని ఖననం చేశారు. అనంతరం రాహుల్ అదృశ్యం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ డెడ్​బాడీ రాహుల్​దేనని తేల్చి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా రాహుల్​ది హత్యేనని, దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించాలని కుటుంబసభ్యులు పోలీసులను వేడుకున్నారు. 

హైకోర్టు జోక్యంతో..

కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్షం చేస్తున్నారని వారు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు వివరాలు సమర్పించాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించడంతో యంత్రాంగాలు అప్రమత్తమై చర్యలు స్పీడప్ చేశాయి. డీఎన్ఏ పరీక్షల్లో రాహుల్ కుటుంబసభ్యుల నమూనాలతో సరిపోలడంతో 52 రోజుల నిరీక్షణ తర్వాత సింగరాయకొండ పోలీసులు సోమవారం తహసీల్దార్​సమక్షంలో శ్మశానవాటికలో పూడ్చిన రాహుల్​మృతదేహాన్ని వెలికి తీసి తండ్రి రాజేశ్వర్​కు అస్తికలు అప్పగించారు. దీంతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు భారీగా చేరుకొని నివాళులర్పించారు. రాహుల్​హత్య నిందితులను గుర్తించి శిక్షించాలని కోరారు.