బషీర్ బాగ్, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా మందుబాబులు మారడం లేదు. ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న స్పెషల్డ్రైవ్లో వేలాది మంది పట్టుబడుతూనే ఉన్నారు.
తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 28, 29 తేదీల్లో నగరవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భారీగా మందు బాబులు పట్టుబడ్డారు. 552 మంది మద్యం సేవించి పట్టుబడగా , అందులో 438 మంది టూ వీలర్, 45 మంది త్రీ వీలర్ , 69 మంది ఫోర్ వీలర్ వాహనదారులు అధిక మోతాదులో మద్యం సేవించి దొరికారు. ఇందులో 10 మందికి అత్యధికంగా 300 బీఏసీ లెవల్స్ నమోదు అయ్యాయి.
గచ్చిబౌలి: సైబరాబాద్లోనూ వీకెండ్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మొత్తం 431 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 325 మంది టూ వీలర్, 16 మంది త్రీ వీలర్, 86 మంది ఫోర్ వీలర్, నలుగురు భారీ వాహనదారులు ఉన్నారు. గతవారం నమోదైన 320 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 264 మందికి జరిమానా, 35 మందికి జరిమానా ప్లస్ సోషల్ సర్వీస్, 21 మందికి కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
