రైల్వే ట్రాక్‌‌‌‌లపై సెల్ఫీలు దిగితే 6 నెలల జైలు శిక్ష

రైల్వే ట్రాక్‌‌‌‌లపై సెల్ఫీలు దిగితే 6 నెలల జైలు శిక్ష

సికింద్రాబాద్, వెలుగు :  సోషల్‌‌‌‌ మీడియాలో వ్యూస్‌‌‌‌ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రైల్వే ట్రాక్‌‌‌‌లపై సెల్ఫీల కోసం యువత రిస్క్‌‌‌‌ చేస్తుండటంపై దక్షిణ మధ్య రైల్వే సీరియస్ అయింది. ట్రాక్‌‌‌‌లపై, ట్రైన్‌‌‌‌లు దిగుతూ, ఎక్కుతూ సెల్ఫీలు తీసుకోవడం, డోర్ల వద్ద వేలాడుతూ రీల్స్‌‌‌‌ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండడంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఎవరైనా రైలు పట్టాలపై సెల్ఫీలు దిగినా, కదులుతున్న రైలును ఎక్కినా, దిగినా, పట్టాలు దాటినా అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. 

ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి చర్యలు ఇండియన్ రైల్వే యాక్ట్‌‌‌‌ 1989 ప్రకారం నేరమని స్పష్టం చేశారు. రూల్స్ ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిషేధిత ప్రాంతం నుంచి ట్రైన్‌‌‌‌లో ఎక్కే ప్రయత్నం కూడా చేయొద్దని తెలిపింది. 

ట్రాక్‌‌‌‌లు దాటేందుకు ఫుట్‌‌‌‌ ఓవర్‌‌‌‌ బ్రిడ్జిలు, సబ్‌‌‌‌వేలు, రోడ్‌‌‌‌ ఓవర్‌‌‌‌ బ్రిడ్జిలను వాడాలని పేర్కొంది. ట్రాక్‌‌‌‌ల దగ్గర నడిచేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫోన్లు వినియోగించరాదని సూచించింది. దక్షిణ మధ్య రైల్వేకు ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమని, నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరింది.