తెలంగాణలో శుక్రవారం కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1044కి చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక కేసులకు మర్కజ్ లింకులే ఉన్నాయన్న మంత్రి… ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. మొత్తం కేసుల్లో 44 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన అన్నారు.కరోనా టెస్టులు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదవుతున్నాయన్న విపక్షాల ఆరోపణలు నిజం కాదని మంత్రి స్పష్టం చేశారు. టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలనే పాటిస్తున్నామన్నారు.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1755 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 35,365 మందికి సోకింది. దీని బారి నుంచి 9065 మంది కోలుకోగా.. 1152 మంది మరణించారు.
