కొత్త సెక్రటేరియెట్​కు భారీ భద్రతా ఏర్పాట్లు

కొత్త సెక్రటేరియెట్​కు భారీ భద్రతా ఏర్పాట్లు

కొత్త సెక్రటేరియెట్​కు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న సెక్రటేరియెట్​ చుట్టూ దాదాపు 600 మంది పోలీసులు పహారా కాయనున్నారు. 25 ఏండ్లుగా సెక్రటేరియెట్ భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) చూస్తుండగా, ఇకపై తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్​ఎస్పీ) విభాగం చూడనుంది.


హైదరాబాద్, వెలుగు: ఈ నెల 30న ప్రారంభం కానున్న కొత్త సెక్రటేరియెట్ మొత్తం నిఘా నీడలో ఉండనుంది. ప్రభుత్వం ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 మంది పోలీసులు సెక్రటేరియెట్​లో పహారా కాయనున్నారు. 25 ఏండ్లుగా సెక్రటేరియెట్ భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) చూస్తుండగా, ఇకపై తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్​ఎస్పీ) విభాగం చూడనుంది. కొత్త సెక్రటేరియెట్ బాధ్యతలను టీఎస్ ఎస్పీకి అప్పగిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. సెక్రటేరియెట్ భద్రతలో టీఎస్ ఎస్పీతో పాటు ఆర్మ్ డ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బంది కూడా ఉంటారు. ఇప్పటికే ఎంపిక చేసిన సిబ్బందికి మొయినాబాద్​లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. సెక్రటేరియెట్ నాలుగు వైపులా ఉన్న సెంట్రీ పోస్టులు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, సీఎం ఆఫీస్ తదితర కీలక ప్రదేశాల్లో సిబ్బంది నిరంతరం పహారా కాయనున్నారు. సెక్రటేరియెట్ లో నిఘా ఉండేలా 300 సీసీ కెమెరాలతో పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వెహికల్, బ్యాగేజీ తనిఖీల కోసం అత్యాధునిక స్కానర్లు పెట్టారు. 

ఆహ్వానాలు ఎవరికో? 

ఈ నెల 30న సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం నుంచే అక్కడ యాగం నిర్వహించనున్నారు. కాగా, మొదట సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ఫిబ్రవరి 17న సెక్రటేరియెట్ ​ప్రారంభించాలని నిర్ణయించారు. నాలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. ఈ క్రమంలోనే సెక్రటేరియేట్​లో అగ్ని ప్రమాదం జరిగింది. పనులు పూర్తి కాకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌‌ సాకుతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అప్పట్లో నలుగురు సీఎంలకు ఆహ్వానం పంపగా, ఇప్పుడు ఎవరెవరికి పంపుతారనేది ఆసక్తికరంగా మారింది.