
వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా 62 మందిని అనర్హులుగా ప్రకటించినట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రచార ఖర్చు లెక్కలు వెల్లడించక పోవడంతో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వారు 2020 జూన్ 8వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుందన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక హైదరాబాద్ పోలీసులు రూ.90.5 లక్షల నగదును సీజ్ చేసినట్టు రజత్ కుమార్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రచార సామాగ్రిని తొలగించామని, అందులో 4,098 వాల్ రైటింగ్స్, 29,526 పోస్టర్లు, 975 కటౌట్లు, 11,485 బ్యానర్లు, 3,498 పార్టీల జెండాలు, 7,308 ఇతర మెటీరియల్ ఉందని వివరించారు. ప్రజాప్రతినిధులు అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగించరాదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల వెబ్ సైట్ల నుంచి పీఎం, సీఎం, మంత్రుల ఫొటోలను తొలగించాలని మరోసారి సూచించారు. ఓటర్లు ఎన్నికల అంశాలకు సంబంధించి టోల్‌ఫ్రీ నంబర్ 1950 లో సంప్రదించవచ్చని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) కింద అన్ని మీడియా మాధ్యమాలను స్పెషల్ టీమ్‌లు పర్యవేక్షిస్తున్నాయని, సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.