ఖమ్మం టౌన్, వెలుగు: మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.3.43 కోట్ల విలువైన 687.409 కిలోల ఎండు గంజాయిని శనివారం కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో తల్లాడ మండలం గోపాల్‌పేటలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో ఈ ప్రక్రియ నిర్వహించారు.
జిల్లాలో నమోదైన 29 కేసులకు సంబంధించిన గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు, సీఐ సర్వయ్య, ఇన్స్పెక్టర్ మోహన్‌బాబు పాల్గొన్నారు.
