వికారాబాద్ జిల్లాలో 7 వేల లీటర్ల అక్రమ డీజిల్ సీజ్

వికారాబాద్ జిల్లాలో 7 వేల లీటర్ల అక్రమ డీజిల్ సీజ్
  •     24 గ్యాస్ సిలిండర్లు కూడా..
  •     వికారాబాద్​లో టాస్క్ ఫోర్స్ దాడులు

వికారాబాద్/పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లాలో అక్రమ వ్యాపారాలు, రవాణాపై టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్ ఎస్​కే అన్వర్ పాషా ఆధ్వర్యంలో అధికారులు జిల్లావ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కర్నాటక నుంచి హైదరాబాద్​కు అక్రమంగా 7,000 లీటర్ల డీజిల్​ను తరలిస్తున్న ట్యాంకర్​ను పట్టుకుని, డ్రైవర్లు గొనెళ్ల కిరణ్, అనిగెల అనిల్ లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మన్నెగూడ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని రవాణా చేస్తున్న టిప్పర్​ను గుర్తించి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని చెన్​గోముల్ పోలీస్ స్టేషన్‌‌లో అప్పగించారు. 

వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి రామకృష్ణ రెడ్డి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 24 డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను టాస్క్ ఫోర్స్ బృందం సీజ్ చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అన్వర్ పాషా మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అక్రమ రవాణా లేదా నిల్వలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు.