సగానికి పడిపోయిన ఉపాధి హామీ పనిదినాలు.. 71 శాతం కుటుంబాలకు 14 రోజుల లోపే పని

సగానికి పడిపోయిన ఉపాధి హామీ పనిదినాలు.. 71 శాతం కుటుంబాలకు 14 రోజుల లోపే పని
  • వీబీజీ రామ్‌‌‌‌జీ కొత్త రూల్స్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌
  • తొలి నెలలో దేశవ్యాప్తంగా 50 శాతం తగ్గిన పని దినాలు
  • టెక్నికల్‌‌‌‌ సమస్యలు.. చెల్లింపుల్లో కొర్రీలు

హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌–గ్యారంటీ ఫర్‌‌‌‌ రోజ్‌‌‌‌గార్‌‌‌‌ అండ్‌‌‌‌ ఆజీవికా మిషన్‌‌‌‌ (గ్రామీణ్‌‌‌‌)’ (వీబీజీ రామ్‌‌‌‌జీ) తొలి నెలలోనే ఆశించిన స్థాయిలో పని కల్పించలేకపోయింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పథకంలో గతేడాది జులైతో పోలిస్తే పనిదినాలు దాదాపు 50 శాతం తగ్గిపోయాయి.

గతేడాది జులైలో దేశవ్యాప్తంగా 15.33 కోట్ల పనిదినాలు కల్పించగా.. ఈ ఏడాది జులైలో 7.67 కోట్ల పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా సగానికి పడిపోయింది. గతేడాది జులైలో 1.42 కోట్ల కుటుంబాలకు పని దొరకగా.. ఈ ఏడాది 68.94 లక్షల కుటుంబాలకే పని లభించింది. తెలంగాణలోనూ ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం రోజుకు 50 వేల నుంచి 70 వేల మంది మాత్రమే పనులకు వస్తున్నారు.

గతేడాది జూన్‌‌ నుంచి ఆగస్టు వరకు రోజుకు సగటున 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది కూలీలకు పని దొరికింది. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షలోపే ఉంది. ఈ నెల 8న 70 వేల మంది, సోమవారం దాదాపు 50 వేల మంది మాత్రమే పనులకు హాజరయ్యారు. గతంలో వేసవిలో రోజుకు 5 లక్షల నుంచి 8 లక్షల మంది కూలీలు పనులకు వచ్చిన సందర్భాలున్నాయి.

ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 100 రోజుల పని కల్పించాల్సి ఉండగా.. చాలామందికి 10 నుంచి 14 రోజులకు మించి పని దొరకడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 3,16,553 కుటుంబాలు ఉపాధి పనులకు హాజరయ్యాయి. వీరికి 36,99,045 పనిదినాలు కల్పించారు.

71 శాతం కుటుంబాలకు 14 రోజుల లోపే పని
ఉపాధి పనులకు వచ్చిన కుటుంబాల్లో 71.4 శాతం అంటే 2,26,086 కుటుంబాలకు కేవలం 1 నుంచి 14 రోజుల వరకే పని దొరికింది. 15 నుంచి 30 రోజుల పని 72,679 కుటుంబాలకు లభించింది. 31 నుంచి 50 రోజుల పని దొరికిన కుటుంబాలు 16,484 మాత్రమే. నల్గొండ జిల్లాలో 19,955 కుటుంబాలకు 2.36 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.

సిద్దిపేట 15,706 కుటుంబాలకు 1.91 లక్షల పనిదినాలతో రెండో స్థానంలో, ఖమ్మం 11,848 కుటుంబాలకు 1.59 లక్షల పని దినాలతో మూడో స్థానంలో ఉన్నాయి. ములుగు జిల్లాలో 2,373 కుటుంబాలకు 24 వేల పనిదినాలు మాత్రమే కల్పించారు.

టెక్నికల్‌‌ సమస్యల ఎఫెక్ట్‌‌
కొత్త పథకంలోని నిబంధనలు, టెక్నికల్ సమస్యలు పనిదినాల తగ్గుదలపై ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయ సీజన్‌‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాల్లో 60 రోజుల విరామ నిబంధన అమలు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. రోజుకు రెండుసార్లు నేషనల్‌‌ మొబైల్‌‌ మానిటరింగ్‌‌ సిస్టమ్‌‌ యాప్‌‌లో డిజిటల్‌‌ హాజరు నమోదు చేయాలనే రూల్ కూడా ఇబ్బందిగా మారింది. కొన్నిచోట్ల నెట్‌‌వర్క్‌‌ లేకపోవడంతో హాజరు నమోదు కావడం లేదు. ఆధార్‌‌ ఆధారిత చెల్లింపుల్లో సమస్యలు, ఇతర టెక్నికల్‌‌ లోపాలతో చాలామందికి కూలి డబ్బులు ఆలస్యమవుతున్నాయి.

నిధుల విడుదలలో ఆలస్యం
కేంద్రం నుంచి నిధులు ఆలస్యంగా రావడం, పాత బకాయిలు పేరుకుపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు కొత్త పనులు మొదలు పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో వ్యవసాయ సీజన్‌‌ నడుస్తుండడంతో చాలామంది కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండడం కూడా ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌‌ అసిస్టెంట్లకు రావాల్సిన మెటీరియల్‌‌ నిధులు ఆలస్యం కావడంతో అభివృద్ధి పనులు నెమ్మదించాయి.

ఆసిఫాబాద్‌‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్‌‌వర్క్‌‌ సమస్యలతో ఎన్‌‌ఎంఎంఎస్‌‌ యాప్‌‌ సరిగా పనిచేయడం లేదు. దీంతో వేలాది మంది కూలీలు పనులకు వెళ్లడం లేదు. కొన్ని చోట్ల పని కావాలని అడిగేవారికి సరిపడా పనులు చూపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.